
విజయవాడ, జూలై 21 ,
అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం మార్కెటింగ్ ఒక రేంజ్ లో చేసి పారేస్తున్నట్లే కనిపిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదటిదశకు సంబంధించినవి పూర్తి కావడానికి ఇంకా మూడేళ్ల సమయం పడుతుంది. ఇంకా రాజధాని అమరావతికి సరైన రహదారులు లేవు. అలాగే మౌలిక సదుపాయాలు లేవు. ఈ సమయంలో కార్పొరేట్ సంస్థలు, దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు అమరాతిని ఒక రేంజ్ లో చంద్రబాబు మార్కెట్ చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. అమరావతిలో ఇన్నివ్యాలీలా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రతి సమావేశంలో చంద్రబాబు అమరావతిలో వ్యాలీలు, హబ్ లు అంటూ పెద్దయెత్తున మార్కెటింగ్ చేస్తున్నారు... తొలుత అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అన్నారు. దీనిపై పెద్దయెత్తున ప్రచారం కూడా చేశారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయినట్లు చెప్పారు. భవిష్యత్ లో రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యున్నతమైన ఐటీ హబ్ గా మారుతుందని, క్వాంటమ్ వ్యాలీ కోసం పేరుగాంచిన సంస్థలు ముందుకు వచ్చాయని కూడా తెలిపారు. ఇక ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ హబ్ గా అమరావతిని మార్చాలని కోరారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జల క్రీడలకు మంచి అవకాశాలున్నాయని, అందుకోసం కోరారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు... ఇక తాజాగా చంద్రబాబు హైడ్రోజన్ వ్యాలీని కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యం పెరిగిందని, దీనిపై పరిశోధనలు చేయాలని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ కు ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారవుతుందని అన్నారు. ఎస్ఎఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. అమరావతి ఒక పెద్ద వ్యాలీ అని, అక్కడ ఇంకా ఎన్ని వ్యాలీలు తెస్తారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద అమరావతిని ప్రపంచంలో ప్రమోట్ చేయడంలో మాత్రం చంద్రబాబు ఏ విషయంలో తగ్గడం లేదన్నది విశ్లేకుల అంచనా. మరి చంద్రబాబు కలలు సాకారమవుతాయా? లేదా? అన్నది భవిష్యత్ లో తేలనుంది.