
విశాఖపట్టణం,జూలై 21 ,
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు లేదు. మోదీ చరిష్మా ఉన్నప్పటికీ స్థిరమైన ఓటు బ్యాంకు కొన్ని దశాబ్దాల నుంచి లేదు. నేటికీ ఆ ఓటు బ్యాంకు శాతం మాత్రం పెరగలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన నాడే ఏదో నాలుగైదు సీట్లువస్తాయి. ఇక్కడ పార్టీ అధ్యక్షులు మారినా.. సామాజికవర్గాల పరంగా ఎంపిక చేసినా.. ఫలితం లేదు. అనేక ప్రయోగాలు చేసిన కేంద్ర నాయకత్వం చివరకు ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా వెళ్లలేమని డిసైడ్ అయినట్లుంది. అందుకే తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి మాత్రమే కీలక పదవులను అప్పగిస్తూ వస్తుంది. ఎవరికీ విడిగా పోటీ చేసే పరిస్థితి లేదు. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉద్దండులైన వారంతా ఓటమినే చవి చూశారు... ఎవరూ గెలవలేదు. కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పుడు పొత్తుతో ఎన్నికయిన పురంద్రీశ్వరి పార్లమెంటు సభ్యురాలిగా విశాఖలో ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొన్న పొత్తుతో రాజమండ్రి నుంచి గెలిచారు. విష్ణుకుమార్ రాజు 2014లో గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే తప్ప 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేకపోయారు. ఇక సోము వీర్రాజు కూడా అంతే. కన్నాలక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపీగా 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి మొన్న టీడీపీలో చేరి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా చాలా ఎవరిని తీసుకున్నా బీజేపీ ఒంటరిగాపోటీ చేసినప్పుడు తోలని చెప్పుకుంటున్న వారు కూడా గెలవలేకపోయారు. . అంటే బీజేపీకి ఏపీలో ఏ మాత్రం ప్రజాదరణ, ఓటు బ్యాంకు ఉందో అర్థం చేసుకోవచ్చు. నాయకత్వ లేమితో పాటు ఎవరికీ వ్యక్తిగత ఇమేజ్ లేదని, వారికి గెలిచే సత్తా లేదని రికార్డులు చెబుతున్నాయి. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ సారి గెలిచినప్పటికీ పార్టీలో తామే కీలకం అని భావిస్తున్న వారిని పక్కన పెట్టింది. కేంద్ర మంత్రి పదవిని శ్రీనివాసరాజుకు ఇచ్చింది. రాష్ట్ర మంత్రి పదవిని సత్యకుమార్ యాదవ్ కు కేటాయించింది. రాజ్యసభ పదవిని పాక సత్యనారాయణకు ఇచ్చింది. అంటే కమలం పార్టీ నాయకుల సత్తా కేంద్ర నాయకత్వానికి అర్థమయిందనే అంటున్నారు. అందుకే పార్టీ వీరికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా పార్టీకి నమ్మకంగా ఉన్న మాధవ్ ను ఎంపిక చేసిందంటున్నారు. మొత్తం మీద కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకుల మీద విశ్వాసం లేదన్నది మాత్రం అర్థమయినట్లు కనిపిస్తుంది.