
అనంతపురం, జూలై 21,
చాలామంది తమ వారసులను రాజకీయంగా ఉన్నత పదవుల్లో చూడాలని పరితపిస్తుంటారు. కానీ కొందరే సక్సెస్ అవుతారు. తాము క్రియాశీలకంగా ఉన్నప్పుడే వారసులను రాజకీయంగా సెట్ చేయాలని ఎక్కువ మంది భావిస్తారు. కానీ కొంతమందికి అది వీలవుతుంది. చాలామంది దశాబ్దాలుగా ఎదురు చూడాల్సి వస్తుంది. అటువంటి యువ నేతలు, వారసులు ఏపీలో చాలామంది ఉన్నారు. దశాబ్దాలుగా సరైన విజయం దక్కక.. చట్టసభల్లో అడుగుపెట్టలేక రాజకీయాల్లో ఇబ్బంది పడిన వారు ఉన్నారు. అయితే ఒకసారి రాజకీయాల్లోకి రావడమే కానీ.. తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా చాలామంది వారసులు సరైన విజయం కోసం పరితపిస్తూనే ఉన్నారు. అటువంటి వారసుల తండ్రులు పేరు మోసిన నేతలే. కానీ క్షేత్రస్థాయిలో వారికి విజయం అందని ద్రాక్ష గానే ఉంది.తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. అంతవరకు ఎర్రం నాయుడుకు ఒక కుమారుడు ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు. కానీ చక్కటి వాగ్దాటితో, చరిస్మ కలిగిన నేతగా ఎదిగారు రామ్మోహన్ నాయుడు. మూడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచి అతి చిన్న వయసులోనే కేంద్ర పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. నారా లోకేష్ తో పాటు చంద్రబాబు కు ఇష్టమైన యువనేతగా మారిపోయారు. అటు తరువాత అమలాపురం ఎంపీ హరీష్ కుమార్ తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. రెండో ప్రయత్నంలో ఎంపీ అయ్యారు.అయితే చాలామంది వారసులు సరైన గెలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారే కానీ గెలుపు తట్టలేదు. గత రెండు ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం చిక్కలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టాలని గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ పరిస్థితి అలానే ఉంది. కాంగ్రెస్, టిడిపి, వైసీపీ నుంచి ఆయన చేయని ప్రయత్నం లేదు. కానీ గెలుపు బాట పట్టలేదు. వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు రాయలసీమలో పరిటాల కుటుంబం నుంచి ఎదురుచూస్తున్నారు శ్రీరామ్. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా.. ఆయనకు మొన్నటి ఎన్నికల్లో సీటు దక్కలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. నేదురుమల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంకా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకట నాగ్, అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వారసులు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.