
నెల్లూరు, జూలై 21,
నెల్లూరులో కుబేర సినిమా స్టైల్‌లో యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ జరిగింది. నిరుపేదలను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి రూ.10 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడ్డారు మోసగాళ్లు. రుణాల కోసం ఫేక్ కంపెనీలను సృష్టించి, నిరుపేదలకు తెలియకుండా రుణాల కోసం వారి ఆధార్ కార్డులు, సంతకాలు, వేలిముద్రలను తీసుకున్నారు. తీసుకున్న రుణం కట్టాలని బ్యాంక్ నుంచి నిరుపేదలకు నోటీసులు అందాయి. దీంతో ఆ నిరుపేదలు ఆందోళనలో ఉన్నారు. 6 నెలల క్రితం బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ భారీ స్కామ్‌పై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.దీనిపై సీఐ రవి నాయక్ మాట్లాడుతూ.. 56 మంది బాధితులను గుర్తించామని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈ స్కామ్‌లో మరింత మందిని విచారించాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులను సైతం విచారిస్తామని అన్నారు.