YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడు పార్టీలు..

మూడు పార్టీలు..

హైదరాబాద్, జూలై 21, 
తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో అసమ్మతి రాగాలు సెగలు రేపుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అంతర్గతంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యక్రమాలతో కాక పుట్టిస్తుండగా, బీజేపీలో ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వాడివేడి వ్యాఖ్యలు కమలం పార్టీని కుదిపేస్తున్నాయి. ఇక అధికార  కాంగ్రెస్ లో భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ హస్తం పార్టీలో దుమారాన్నే లేపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ అంతర్గత సమస్యలను పరిష్కరించకపోతే ఈ మూడు పార్టీలకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు కల్వకుంట్ల కవిత రాసిన లేఖ విడుదల కావడం, ఆ తర్వాత పార్టీలో "దయ్యాలున్నాయని" వ్యాఖ్యలు చేయడం నుంచి తెలంగాణ జాగృతి జెండా, ఎజెండా వరకు గులాబీ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనే కవిత నేరుగా అసమ్మతి అస్త్రం సంధించడం విశేషం. ఇప్పటివరకు దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి ఉంది. ఇలాగే కవిత తన సొంత ఎజెండాతో పని చేసుకుంటూ పోతే చర్యలు తప్పవన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఏది ఏమైనా ప్రతిపక్షంగా బలపడాల్సిన తరుణంలో ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న వ్యాఖ్యలు, రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పార్టీ ముఖ్యులు అంతర్గతంగా మదనపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణే తాను చేపడుతున్నట్లు కవిత చెబుతున్నారు..తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉండి, చివరిలో తప్పిపోయినప్పటి నుండి ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయంగా కొంత మౌనంగా ఉన్నారు. అయితే ఇటీవలే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీలో రచ్చ రచ్చే నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి "ఏటీఎంగా మారిందని" ప్రధాని మోదీ గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, "కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ అనుమతితోనే నిర్మించారు, నేను ఆర్థిక మంత్రిగా నిధుల విషయంలో మాత్రమే జోక్యం చేసుకున్నాను" అని చెప్పారు."కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు మేలు చేసేదే, కానీ ఇందులో అవినీతి జరిగింది" అని కూడా చెప్పారు. అయితే ఇది ప్రధాని మోదీ వ్యాఖ్యలకు భిన్నంగా ఉందన్నది బీజేపీలోని కొందరి వాదన. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ "తాము మాట మార్చేందుకు ఊసరవెల్లులం కాదని, ప్రధాని మోదీ అభిప్రాయమే పార్టీ అభిప్రాయమని" కుండబద్దలు కొట్టారు. ఇలా ఈ అంశం ఇరువురి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అధ్యక్ష పదవిని ఆశించినా హైకమాండ్ నుండి అతనికి గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. ఆ పదవిని రాంచందర్ రావు ఎగురేసుకుపోయారు. అప్పటి నుండి ఈటలకు ప్రాధాన్యత ఉందన్న వాదన బీజేపీలో ఉంది. ఈ క్రమంలోనే ఈటల పార్టీలోని అసంతృప్తి నేతలతో మంతనాలు జరుపుతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు శామీర్‌పేటలోని తన నివాసంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి:
"నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో మొత్తం పైకి పంపిస్తా... నా చరిత్ర తెలియదు నా.....కొ...కా""2019లో మోదీ ప్రభంజనం ఉన్నా నేను గెలిచా. టీఆర్ఎస్‌కు 53 వేల మెజార్టీ వచ్చింది. నీకు మెజార్టీయే రాలేదు.""నేను ఎవరికీ భయపడేది లేదు. నాపై జరిగే కుట్రలను ఎదుర్కొంటా.""కడుపులో కత్తులు పెట్టుకునే వారు పార్టీలో ఉంటారు. వారితో యుద్ధం చేయడం కష్టం కానీ ఎదురెళ్లి నిలబడాల్సిందే.""నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యే ఉంటా, నా బలం ప్రజాదరణ. పార్టీ కాదు, ప్రజలే."ఈ వ్యాఖ్యలన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి మాట్లాడినవే అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలోని విభేదాలను ఆవిష్కరిస్తే, ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజుటి వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఇలా ఉంటే, అధికార పార్టీ  కాంగ్రెస్  కూడా ఇందుకు మినహాయింపు కాదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తేల్చి చెబుతున్నాయి. "పదేళ్లు నేనే సీఎం ఉంటా" అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం పదవిని పార్టీలో "ఎవరూ శాశ్వతంగా రాయించుకోలేరని", పార్టీలో "అందరి సమిష్టి నిర్ణయమని" సీఎం రేవంత్ రెడ్డిపై కౌంటర్ అటాక్ చేశారు. ఇది "పార్టీ విధానాలకు వ్యతిరేకం" అన్నారు. పార్టీని "సామ్రాజ్యంలా భావిస్తే, పార్టీ నేతలు, కార్యకర్తలు సహించరని" చెప్పారు.పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు "ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం ఎన్నిక ఉంటుందని" చెప్పారు. అంతే కాకుండా సీఎం పదవికి "తాను రేసులో ఉన్నానని", మంత్రి పదవి కూడా దక్కకపోవడం పట్ల "తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు" రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా  సీఎంను ఉద్దేశించినవే కావడంతో అధికార పార్టీలోనూ అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని అర్థమవుతోంది., బీజేపీలో ఉన్నట్లే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ లోనూ అసమ్మతి వర్గం తయారవుతోందని తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఈ మూడు పార్టీలు అసమ్మతి రాగాలను ఆపేలా ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ అసమ్మతి నేతలు సైతం పార్టీలో "ఉంటారా, వేరు కుంపటి పెడతారా" అన్న చర్చ నడుస్తోంది.

Related Posts