
విజయవాడ, జూలై 23,
వైసీపీ అధినేత జగన్ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొంత సానుకూలతతోనే ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లకపోయినా ఆయన ఇక్కడి నుంచి పార్టీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా సాఫ్ట్ కార్నర్ గానే వ్యవహరిస్తున్నారని, అదే సమయంలో బీజేపీ పై జగన్ పార్టీ పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో తాము వ్యతిరేకించినప్పుడు ఏపీలో పర్యటించినప్పుడల్లా చంద్రబాబుపైనా, తెలుగుదేశం పాలనపైన విమర్శలు చేసే ప్రధాని నరేంద్ర మోదీ సయితం ఈసారి జగన్ విషయాన్ని ప్రస్తావించకపోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తమను కాదని, జగన్ ను కూడా చంకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం వారిలో బలపడుతుంది.... ఇటీవల వరసగా రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. అమరావతి రాజధాని రీలాంచింగ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు జగన్ ప్రస్తావన లేకుండా తన ప్రసంగంలో జాగ్రత్త పడ్డారనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడును, పవన్ కల్యాణ్, లోకేశ్ లను పొడిగినప్పటికీ జగన్ ను విమర్శించకపోవడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే విశాఖకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రెండుసార్లు ప్రధాని మోదీ వచ్చినప్పటికీ బహిరంగ సభలో జగన్ ప్రస్తావన తేవకపోవడాన్ని తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే అని పాసింగ్ రిమార్క్ చేశారు తప్పించి జగన్ అవినీతిపై పెద్దగా మాట్లాడలేదని తెలుగుతమ్ముళ్లు కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. కేటాయించనున్నారా? ఏదో జరుగుతుందని... ఇక జగన్ కేసుల్లో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని కూడా వారు ఏదో జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై 2014లో నమోదయిన అనేక కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదు. న్యాయస్థానాల్లో అనేక కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటిపై అతీ గతీ లేదని అంటున్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఎలాంటి పురోగతి లేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా సీబీఐ కేసును సరిగా దర్యాప్తు చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. ఈ కేసుల్లో అనుమానితులైన వారు బెయిల్ పై ఉండటాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. . ఇక చిన్న విషయమూ బయటకు వచ్చినా వెంటనే స్పందించే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో ముందడుగు వేయడం లేదన్న ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మద్యం కుంభకోణం కేసును ఈడీ సీరియస్ గా తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. చిన్నా చితకా కేసుల్లో హడావిడి చేసే ఈడీ అధికారులు దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణంపై ఎందుకు స్పందిచండం లేదని ప్రశ్నించారు. కేవలం నిందితులను విచారించి వదిలేశారన్న విమర్శలు టీడీపీ నుంచి బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీ స్థాయి కమలం నేతలపై అనుమాన బీజం సైకిల్ పార్టీ నేతల్లో బయలుదేరిందనుకోవాలి. ఆ అనుమానం పెరిగి పెద్దది కాకముందే బీజేపీ తగిన చర్యలకు ఉపక్రమించాలని నేతలు కోరుతున్నారు.