
విజయవాడ, జూలై 24,
వైసీపీ నేతలు ఒక్కొక్కరు జైలు పాలు అవుతున్నారు. వారు వీరు అన్న తేడా లేకుండా అందరి చుట్టూ ఉచ్చు బిగించి మరి లోపల వేయిస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా జాబితాలో మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. ప్రముఖంగా ఆర్కే రోజాతో పాటు అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరు నేతలు వైయస్సార్సీపి హయాంలో ప్రత్యర్థుల విషయంలో దారుణంగా వ్యవహరించారు. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఓ 12 మంది అరెస్టు అయ్యారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ తో సంచలనంగా మారింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే అంతకంటే ముందే మాజీ మంత్రులు ఆర్కే రోజా తో పాటు అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మంత్రులుగా ఉండే సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. వాటిని బయటకు తీసి ఇద్దరినీ అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మిధున్ రెడ్డి తర్వాత అరెస్టు ఈ ఇద్దరిదేనని పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతోంది.ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వార్జ్ కుంభకోణానికి సంబంధించి ఆయనను అరెస్టు చేశారు. అదే కేసులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సైతం అరెస్టయ్యారు. అయితే విచారణ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నెల్లూరులోని ప్రధాన ప్రాంతాల్లో వేలకోట్ల రూపాయలకు సంబంధించి భూములు కొనుగోలు చేసినట్లు.. అందులో అక్రమ మైనింగ్ పాల్పడినట్లు.. ఇందులో గోవర్ధన్ రెడ్డి తో పాటు అనిల్ కుమార్ యాదవ్ కి కూడా సంబంధం ఉందని విచారణలో ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటికీ ఈ కుంభకోణానికి సంబంధించి పలుమార్లు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అయితే తాజాగా శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అనిల్ కుమార్ యాదవ్ పై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఏపీకి అందుబాటులో ఉండడం చాలా తక్కువ. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉండగా ఆయనకు మంత్రి పదవి లభించింది. మొన్నటి ఎన్నికల్లో వ్యతిరేకత ఉందని చెప్పి ఆయనను నరసరావుపేట ఎంపీ సీటుకు పంపించారు. అక్కడ టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. అయితే ఓడిపోయిన నాటి నుంచి ఎక్కడా కనిపించడం లేదు. నరసరావుపేట వైపు చూడడం లేదు. అలాగని నెల్లూరు సిటీ బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లో సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఇటువంటి తరుణంలో నెల్లూరు మైనింగ్ కుంభకోణంలో ఆయన పేరు బయటకు వచ్చింది. దీంతో అరెస్టుకు అంతా రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.మరోవైపు మాజీ మంత్రి రోజా అరెస్టు తప్పదని తెగ ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉండేవారు. ఆడుదాం ఆంధ్ర తో పాటు సీఎం కప్ పోటీల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపించాయి. దీనిపై సీనియర్ క్రీడాకారులతో పాటు క్రీడా సంఘాల ప్రతినిధులు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో అన్ని జిల్లాల నుంచి సమాచారం సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని గుర్తించింది. దీనిని బాధ్యులు చేస్తూ అప్పటి మంత్రి రోజాతో పాటు ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ పై కేసు నమోదు చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ కేసులో రోజా అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఈ ఇద్దరు మాజీ మంత్రుల అరెస్టుతో వైసీపీలో ఒక రకమైన చేంజ్ కనిపించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..