
హైదరాబాద్, జూలై 24,
తెలంగాణలో గత నాలుగు, ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బయట అడుగుపెట్టేందుకు జనాలు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కాగానే వర్షం దంచికొడుతుండడంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వస్తుంది. ఓవైపు వర్షం.. మరోవైపు ట్రాపిక్ తో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఉప్పల్, బేగంపేట, సికింద్రాబాద్, మెట్టుగూడ, పంజాగుట్ట, ముషీరాబాద్, తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి భారీ వరద నీరు చేరుకుంది. ఈ రోజు కూడా బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి పంజాగుట్ట వరకు వెళ్లే ఫై ఓవర్ల మీద భారీ ట్రాఫిక్ ఏర్పడింది.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. ట్రాఫిక్ లో అంబులెన్సులు కూడా చిక్కుకుపోయాయి. దీంతో.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తంది. సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వర్ష కారణంగా రోడ్లపైకి వచ్చిన వరద నీరుతో ఈ సమస్య ఏర్పడుతోంది. కిలో మీటర్ ప్రయాణం చేసేందుకు అరగంట సమయం పడుతుందంటే.. ట్రాఫిక్ సమస్య ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే గంట నుంచి గంటన్నరకు పైగా సమయం పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భారీ వర్షం, మరో వైపు ట్రాఫిక్ జామ్ తో భాగ్యనగర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.