YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాపం..మధుయాష్కీ...

పాపం..మధుయాష్కీ...

నిజామాబాద్, జూలై 25, 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ కు ఇక ఈ మూడేళ్ల కాలంలో ఎటువంటి పదవులు దక్కే అవకాశాలు లేవు. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన నేపథ్యంలో ఆయనకు అన్ని దారులు మూసుకుపోయాయి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వరాదని నిర్ణయించడంతో పదవులకు మధు యాష్కి గౌడ్ పదవులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆయన పెద్దగా యాక్టివ్ గా పార్టీలో లేకపోవడానికి కూడా కారణమదే. రాహుల్ గాంధీ టీంలో చురుకైన మెంబర్ గా ఒకనాడు వెలుగు వెలిగిన మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పదవులు లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి ఇది మధుయాష్కీ గౌడ్ చేసుకున్న స్వయం కృతాపరాధమే. ఆయన నిజామాబాద్ జిల్లాను వదిలి రావడమే చేసిన అతి పెద్ద తప్పు. అక్కడి నుంచి ఎల్.బి.నగర్ కు రావడంతో అక్కడి ప్రజలు ఆదరించలేదు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయకపోవడం వరకూ కరెక్టే అయినా ఆ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఉంటే కొంత అనుకూల ఫలితం వచ్చేదని అంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కోరిన వెంటనే నిజామాబాద్ ను వదిలి ఎల్.బి.నగర్ కు రావడం, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఓటమి తప్పలేదు. దీంతో మరో ఐదేళ్ల పాటు పదవి కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొంటూనే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తెలంగాణ ఏర్పాటు కోసం ఓప్పించేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. 2009 నుంచి 2014 వరకు ఆయన ఇంచుమించు రాష్ట్ర మీడియాలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే, 2014 ఎన్నికలతో ఆయన రాజకీయ ప్రయాణం మారింది. తెలంగాణ కోసం పోరాడిన ఇమేజ్ ఉన్న మధు యాష్కి ఆ ఎన్నికల్లోనూ గెలిచి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా, సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ తరపున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే పోటీ చేయడంతో మధు యాష్కికి ఓటమి తప్పలేదు. సుమారు లక్షా యాభై వేల ఓట్ల తేడాతో కవిత చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ గా మారిపోయారు. నియోజకవర్గానికి కూడా ఎప్పుడో అన్నట్లుగా తప్పితే పర్యటించింది లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా ఢిల్లీ యూనివర్సిటీలో లా చదవడం, అమెరికాలో లా ఫర్మ్ నిర్వహించిన ఆయన టాలెంట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. కానీ మధుయాష్కి గౌడ్ ఓడిన తర్వాత జిల్లాను పట్టించుకోకుండా విదేశాలకు, ఢిల్లీకే పరిమితం కావడంతో ఆయన రాజకీయ జీవితంలో ఎదుగు బొదుగూ లేకుండా పోయింది. తనతో పాటు పార్లమెంటు సభ్యులుగా ఉన్న వారు నేడు రాష్ట్ర మంత్రులుగా ఉంటే మధు యాష్కి గౌడ్ మాత్రం సాధారణ కాంగ్రెస్ నేతగానే మిగిలిపోవాల్సి వచ్చింది. అది ఆయన చేసుకున్నదే. అందుకే రాజకీయాల్లోనూ చేసుకున్నవారికి చేసుకున్నంత అనే సామెత వర్తిస్తుంది. 

Related Posts