
న్యూఢిల్లీ, జూలై 25,
భారత రాజకీయాల్లో ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన ఈ అత్యున్నత పదవికి సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ వ్యూహాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోని కీలక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. తదుపరి ఉపరాష్ట్రపతి బీజేపీ నుంచే అవుతారని తెలుస్తోంది. అంతేకాదు ఆ నాయకుడు పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి అత్యంత కట్టుబడిన వ్యక్తి అయి ఉంటారని సమాచారం.ఈ ప్రకటనతో.. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి వివిధ రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ముఖ్యంగా జేడీయూ నేత, కేంద్రమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ భేటీ కావడంతో ఈ ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే ఇది సాధారణ సమావేశమే అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వీరి మధ్య జరిగిన సమావేశంలో ఎక్కడ కూడా ఠాకూర్ అభ్యర్తిత్లం గురించి చర్చలు జరగలేవని పేర్కొన్నాయి.తమ సొంత పార్టీలో దీర్ఘ కాలంగా సేవలందిస్తూ.. పార్టీ భావజాలంతో పూర్తి అనుబంధం ఉన్న సీనియర్ నాయకుడికే ఈ అవకాశం లభిస్తుందని స్పష్టం చేశాయి. అలాగే ఇంతకాలం రేసులో ఉన్నట్లు భావించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్, జేడీయూ నేత హరివంశ్ నాయణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ వంటి కీలక నాయకులను ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిగణనలోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ బీజేపీ తాజా ప్రకటనతో వీటన్నిటికీ బ్రేకులు పడ్డాయి.ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజీ (ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే పార్లమెంటు సభ్యుల బృందం) ఏర్పాటు, రిటర్నింగ్ అధికారిని ఖరారు చేసే ప్రక్రియను కమిషన్ చేపట్టింది. ఈ లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మరి తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు చేపడతారో చూడాలి.