YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సర్దుకోలేకపోతున్నాము

సర్దుకోలేకపోతున్నాము

విజయవాడ, జూలై 28, 
జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? వారిలో ప్రస్టేషన్ పతాక స్థాయికి చేరుకుందా? టిడిపి తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారా? ఎంతసేపు తమను సర్దుబాటు చేసుకోవాలన్న సూచనను వ్యతిరేకిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పైకి టిడిపితో సమన్వయం కొనసాగుతున్న.. లోలోపల మాత్రం జనసేన ఎమ్మెల్యేలు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టిడిపి నేతల పెత్తనం కొనసాగుతుండడాన్ని వారు సహించలేకపోతున్నారు. అలాగని నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే సర్దుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొందరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జులు అసంతృప్త స్వరం వినిపిస్తే వేటు వేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు సైతం వెనక్కి తగ్గుతున్నారు.తెలుగుదేశం కూటమిప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి. 100% విజయంతో.. డిప్యూటీ సీఎం గా పవన్.. మరో ఇద్దరు జనసేన మంత్రులు.. మరో ఇద్దరు ఎంపీలు.. 21 మంది ఎమ్మెల్యేలతో జనసేన పటిష్ట స్థితిలో కనిపిస్తోంది. అయితే రాజకీయంగా మైలేజ్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం నియోజకవర్గాల్లో ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అంతా టిడిపి నేతల పెత్తనం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పైగా అక్కడ టిడిపి నేతల మాటే చెల్లుబాటు అవుతోందని ప్రచారం నడుస్తోంది. ఆ పై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి లకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి మాటనే ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతోంది. ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్నారు అన్నట్టు ఉంది జనసేన శాసనసభ్యుల పరిస్థితి. ఇది రోజు రోజుకు పతాక స్థాయికి చేరుకుంటుంది. దీనిపై జనసేన ఎమ్మెల్యేల్లోనే చర్చ నడుస్తోంది.వాస్తవానికి రాష్ట్రస్థాయిలో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుకు అంగీకరించారు టిడిపి నేతలు. జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలు టిడిపికి కంచుకోట లాంటివి. అక్కడ ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన నాయకులు సైతం ఉన్నారు. అటువంటివారు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేశారు. ఇప్పుడు టిడిపి నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో సీట్లు త్యాగం చేసిన నేతలకు పదవులు దక్కాయి. పార్టీపరంగా ప్రాధాన్యం లభిస్తుంది. సీట్లు త్యాగం చేశారు కాబట్టి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో సైతం చోటిస్తున్నారు. దీంతో వారు దూసుకుపోతున్నారు. సీనియర్లు కావడంతో అధికారులతో కూడా పనులు చేయించుకుంటున్నారు. వారితో చూసుకుంటే జనసేన ఎమ్మెల్యేల మాటలు కొన్నిచోట్ల చెల్లుబాటు కావడం లేదు. దీంతో వారికి అవమానాలు ఎదురవుతున్నాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు దాదాపు జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి.జనసేన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ బాధను వ్యక్తం చేస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదూకుడును నియంత్రించాలంటే పొత్తు కొనసాగాలని.. అలా కొనసాగాలంటే సర్దుబాటు చేసుకోవాలని జనసేన ఎమ్మెల్యేలకు నాయకత్వం సూచిస్తోంది. దీంతో ఒక రకమైన అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉంది. పవర్ లేని ఈ పదవులు ఎందుకని.. టిడిపి నేతల మాటలే చెల్లుబాటు అవుతుంటే ఇక తాము ఉండి ఏమి ప్రయోజనమని ఎక్కువమంది బాధపడుతున్నారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే జనసేన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తప్పకుండా ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

Related Posts