
శ్రీనగర్, జూలై 28,
సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆగడాలకు కేంద్రం టెక్నాలజీతో చెక్ పెట్టబోతోంది. జవాన్లకు బాడీ కెమెరాలు అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపించే క్రమంలో సాయుధ బలగాలపైనే తిరగబడుతూ దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న సరిహద్దు బలగాలు.. ఇటువంటి ఘటనలను ఆధారాలతో సహా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాంతో.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన బాడీ-వోర్న్ కెమెరాలను సమకూర్చుకుంటోంది. ఈ కెమెరాలు జవాన్ల యూనిఫామ్‌లకు అమర్చబడి, సరిహద్దుల్లో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాయి. దానిలో భాగంగానే.. భారత్-బంగ్లాదేశ్, పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఎస్‌ఎఫ్ జవాన్లకు 5వేలకు పైగా శరీరానికి ధరించే కెమెరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ముఖ్యంగా.. బంగ్లాదేశ్, పాక్ సరిహద్దుల వెంట విధులు నిర్వర్తిస్తున్న BSF దళాలకు ఆయా బాడీ కెమెరాలను అందించనుంది. ఇప్పటికే 2,500 కెమెరాలను పంపిణీ చేయగా, మరో 2,500 కెమెరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు ఎంపిక చేసిన సరిహద్దు ఔట్ పోస్టుల్లోని సిబ్బందికి ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ పరికరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్ని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు అందజేయనుంది.బీఎస్‌ఎఫ్ ప్రతిపాదించిన ఈ రెండు విధానపర నిర్ణయాలపై సమగ్ర సమీక్ష తర్వాత కేంద్ర హోంశాఖ ఇటీవల ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే.. రెండు దశల్లో వీటిని భారత్-బంగ్లా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్‌ఎఫ్‌కు అందజేస్తుంది. రాత్రిపూట చిత్రీకరణ, 12-14 గంటల ఫుటేజీ నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం ఈ కెమెరాలకు ఉండనుంది.