
హైదరాబాద్, జూలై 28,
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ కేంద్రంలో టెస్ట్ ట్యూబ్ బేబీ (ఐవీఎఫ్) పద్ధతి జరగలేదని.. బయట వేరొకరికి పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి, సంతానం లేని దంపతులకు అద్దె గర్భం ద్వారా పుట్టారని నమ్మించి ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ దారుణ మోసం ద్వారా డాక్టర్ నమ్రత దంపతుల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఇది కేవలం వైద్య మోసం కాదని.. బిడ్డల అక్రమ రవాణాఅని పోలీసులు పేర్కొన్నారుఈ కేసు వివరాలను నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. గోపాలపురంకు చెందిన ఒక జంట ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై రైడ్ చేశామని డీసీపీ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఒక దంపతులు ఆన్‌లైన్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని డాక్టర్ నమ్రతను సంప్రదించారు. సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లలు పుట్టించడానికి రూ.30 లక్షలు అవుతుందని నమ్రత వారికి చెప్పింది. దీంతో దంపతులు విజయవాడ వెళ్లి, అక్కడ తమ శాంపిల్స్ ఇచ్చారు. సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని డాక్టర్ వారికి నమ్మబలికింది.కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని ఆ జంటకు డాక్టర్ నమ్రత చెప్పింది. సిజేరియన్ ద్వారా డెలివరీ అయిందని అబద్ధం చెప్పి.. అదనంగా మరో రూ.10 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తం రూ.40 లక్షలు దంపతుల నుంచి లాగేసింది. అయితే.. కొన్ని నెలల తర్వాత ఆ బాబు పోలికలు ఆ దంపతులకు అనుమానాస్పదంగా అనిపించాయి. దీంతో వారు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని డాక్టర్‌ను కోరారు. ఇందుకు నమ్రత అస్సలు ఒప్పుకోలేదు. దాంతో దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. ఆ పరీక్షలో ఆ బిడ్డ తమకు చెందినది కాదని.. మరొకరి డీఎన్‌ఏగా తేలడంతో దంపతులు డాక్టర్ నమ్రతను నిలదీశారు. అయితే.. నమ్రత తన కొడుకు జయంత్ కృష్ణతో కలిసి బాధితులను బెదిరింపులకు పాల్పడింది. జయంత్ కృష్ణ తాను న్యాయవాదినని చెప్పుకొని బెదిరించాడు.డాక్టర్ నమ్రత చేసింది నిజానికి సరోగసి కాదు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి, సరోగసి ద్వారా మీకు పుట్టిన బిడ్డ అని దంపతులను నమ్మించింది. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకొచ్చి, అక్కడ డెలివరీ చేసి, ఆమెకు పుట్టిన బిడ్డను ఆ రాజస్థాన్ దంపతులకు ఇచ్చింది. బిడ్డను వద్దనుకున్న ఆ మహిళకు రూ.90 వేలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు సరైన అనుమతులు లేవని, ఆ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు 2021లోనే గడువు తీరిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. హైదరాబాద్ మెడికల్ ఆఫీసర్ వెంకట్ కూడా ఈ రైడ్‌లో పాలుపంచుకుని.. 2020లోనే వారి అనుమతులు ముగిశాయని, ఆసుపత్రి మూసేస్తున్నామని వారు చెప్పారని.. క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని చెప్పారు. అయినా అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను నడుపుతున్నారని ఆయన అన్నారు.సెంటర్‌లో థియేటర్, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, 7 రకాల అనాలసిస్ చేసే ఎక్విప్‌మెంట్ ఉన్నాయని, డస్ట్ బిన్ చెక్ చేస్తే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు ఉన్నాయని, ఐవీఎఫ్ ఫెయిల్యూర్, సరోగసిలో అక్రమాలు వంటి కేసులు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మందికి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు.
వీర్యాలు మార్చి దందా
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌బజార్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, వైద్యాధికారులు పలు కీలక పత్రాలు, వీర్య కణాల శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్టు తేలింది.వీర్యం దానం చేసేవారికి ఒక్కొక్కరికి రూ.5- 10 వేల వరకు ఇస్తున్నట్లు తెలిసింది. ఫోర్న్ వీడియోల చూపించి వారితో వీర్యం సేకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా వీర్యం దానం చేస్తున్నట్లు తెలిసింది. ఇలా సేకరించిన వీర్య కణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్‌లో ఇండియన్ స్పెర్మ్‌టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ దందాపై పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు.
ఎఫ్ ఐ ఆర్ లో విస్తుపోయే నిజాలు
సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఈనెల 25న గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సోనియా దంపతులు ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతాను కలిశారు. తమకు సంతానం కావాలని, ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా సంతానం కలిగేలా చేయాలని కోరారు. దీంతో డాక్టర్ నమ్రతా ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం వారి నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేసింది. దీంతో 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో, మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా దంపతులు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రొసీజర్ లో భాగంగా విశాఖపట్టణంలో మరో బ్రాంచ్‌కు శాంపిల్ కలెక్షన్ కోసం ఆ దంపతులను పంపించారు. కేవలం మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుసార్లు విశాఖ సెంటర్‌కు పంపించినట్లు బాధితులు పేర్కొన్నారు.విశాఖలోని సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ ద్వారా గతంలో అనేక దారుణాలకు నిర్వాహకులు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద మహిళలను టార్గెట్ చేసి అద్దె గర్భంతో ఆస్పత్రి నిర్వాహకురాలు లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఆస్పత్రిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.విజయవాడలోనూ బెంజ్ సర్కిల్ సమీపంలో యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. 2015 నుంచి వీరి దందా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ ఆస్పత్రిపై రెండు సార్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. పలు సందర్భాల్లో లైసెన్సునుసైతం రద్దు చేశారు. ఆ తరువాత, వేరేవారి పేరుపై ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. డాక్టర్ కరుణ పేరుపై ఈ సెంటర్ నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకోసం గాలిస్తున్నారు. సంతానం లేమి దంపతులకు సరోగసీ ద్వారా తక్కు ధరకే సంతాన ప్రాప్తి కల్పిస్తామని కృష్ణా, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డాక్టర్ నమ్రతా గతంలో స్వయంగా ప్రచారం చేసినట్లు చెబుతున్నారు.