
హైదరాబాద్, జూలై 28,
తెలంగాణ ట్యాపింగ్ ఫైల్ పాలిటిక్స్‌లో హైవోల్టేజ్ హీట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. రోజుకో లీకు..వారం రోజులకో ఇద్దరిని విచారిస్తూ..కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గాలి గత్తర నడుస్తూనే ఉంది. ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా రివర్స్ రూట్‌లో వస్తోంది. తాము ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పడం కంటే..సీఎం రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని..అందుకు ఉదాహరణలు ఇవ్వే అంటూ దుమ్మెత్తిపోస్తోంది.రేవంత్‌రెడ్డి కూడా మంత్రులు, అపోజిషన్ లీడర్లతో పాటు వేలాది ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు ఆరోపిస్తూ వస్తున్నారు. కేటీఆర్ అయితే మరో అడుగు ముందుకేసి..తన సీటుకు ఎవరు ఎసరు పెడతారో అనే భయంతో సహచర మంత్రుల ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని బాంబు పేల్చారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఓపెన్‌గానే చెప్పేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై లై డిటెక్టర్ టెస్ట్‌కుకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ కూడా విసిరారు. బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా సీఎం ట్యాప్ చేయిస్తున్నారని పెద్ద మాటే అనేశారు.ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని..16మంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ లెక్కలతో సహా సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ట్యాపింగ్ వార్ పీక్ లెవల్‌కు చేరుకుంది. కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం ఆయనపై కేసులు నమోదవడంతో ట్యాపింగ్ ఫైటింగ్ ఉత్కంఠ రేపుతోంది. కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తారన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి దగ్గర భారీగా గుమిగూడటంతో మరోసారి న్యూస్ హెడ్‌లైన్‌గా మారింది ట్యాపింగ్ ఎపిసోడ్.అయితే తమ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని..ఒకవేళ ట్యాపింగ్ జరిగినా తనకు సంబంధం లేదని కేటీఆర్ ఎంత చెప్తున్నా అనుకున్నంతగా పబ్లిక్‌లోకి వెళ్లడం లేదట. సిట్ దర్యాప్తు అంటూ ఇస్తున్న లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే కారు రివర్స్ గేర్ వేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారట. దాంతో ట్యాపింగ్ ఇష్యూను..ట్యాపింగ్ ఆరోపణలతోనే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అందుకు తగ్గట్లుగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని సీఎం ఆఫ్ ది రికార్డులో చెప్పినట్లు వచ్చిన వార్తలను అస్త్రంగా మల్చుకుంటోంది కారు పార్టీ.మంత్రులు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను సీఎం విన్నారని.. ప్రైవేటు హ్యాకర్లతో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని సీరియస్ అలిగేషన్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ట్యాపింగ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని..మంత్రులు ఢిల్లీలోనే ఉండిపోవడంతో..శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడిందని బీఆర్ఎస్ కాస్త గట్టిగానే వాయిస్ రేజ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం తేలే దాకా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాబోమని మంత్రులు తేల్చి చెప్పారని కూడా అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. అంతే కాదు సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగేది కూడా డౌటేనని అంటోంది గులాబీ పార్టీ.సీఎం రేవంత్ రెడ్డి తన సహచర మంత్రుల ఫోన్లతో పాటు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఎవరేం మాట్లాడుకుంటున్నారో వింటున్నారంటున్న బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో గానీ..తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ లీడర్లు చేసిన ట్యాపింగ్ ఆరోపణలతో క్యాబినెట్‌లో కలకలం నడుస్తూనే ఉంది. ఇక అధికార కాంగ్రెస్ నేతల్లో కూడా ట్యాపింగ్ గుబులు టెన్షన్ పెడుతోందట.గులాబీ నేతలు చెప్తున్నట్లు నిజంగానే ట్యాపింగ్ చేస్తున్నారా? తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామో, ఎవరెవరిని కలుస్తున్నామో సీఎం రేవంత్ రెడ్డి అంతా తెలుసుకుంటున్నారా అని మంత్రులతో సహా పార్టీ లీడర్లలో కూడా అనుమానం వ్యక్తమవుతోందట. అయితే కేసీఆర్ హయాంలో జరిగిన ట్యాపింగ్ బాగోతంపై నిజాలు బయటకు రావొద్దనే..బీఆర్ఎస్ నేతలు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని కూడా కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతోన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఆటలో పైచేయి సాధించేదెవరో చూడాలి.