YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మత్తులో విద్యార్ధిలోకం!

మత్తులో విద్యార్ధిలోకం!

సంగారెడ్డి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి బిజినెస్ సాగిపోతోంది. గతంలో పెద్దలకే అందుబాటులో ఉండే ఈ మాదకద్రవ్యం.. పిల్లల చేతికీ చిక్కుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీల్లోనూ గంజాయి పొట్లాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పరిణామంపై అంతా షాకవుతున్నారు. సంగారెడ్డిలోనే కాక.. మెదక్ లోనూ ఈ దందా యథేచ్ఛగా  సాగిపోతోంది. దీంతో గంజాయి రవాణా చేస్తూ.. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది పోలీస్ యంత్రాంగం. ఉమ్మడి జిల్లా పరిధిలో పారిశ్రామికవాడలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలతోనూ సరిహద్దులు ఉన్నాయి. దీంతో గంజాయి విక్రేతలు దందా సాగిస్తున్నారు. సంగారెడ్డి నుంచే గంజాయిని వివిధ ప్రాంతాలకు తరలించి బిజినెస్ చేస్తున్నారు. గంజాయి రవాణా కోసం సాగు, ట్రాన్స్ పోర్ట్ లో అనుభవమున్న వారి సహకారం తీసుకుంటున్నారు. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌ కాలనీ సమీపంలో ఉన్న ఒక పాఠశాల వద్ద బహిరంగంగానే కొందరు వ్యక్తులు విద్యార్థులకు గంజాయి విక్రయిస్తుంటారు. పట్టణంలో వివిధ కాలనీవాసులు ఇక్కడికి వచ్చి గంజాయి సేవిస్తూ మత్తులోకి జారిపోతున్నారు. 

 

బహిరంగంగానే గంజాయి సేవిస్తూ పలువురు మత్తులోకి జారిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతేడాదిలో అయితే పతాకశీర్షిక అయింది. కానీ పోలీస్ యంత్రాంగం ఉదాసీనంగా ఉండడంతో ఈ దందాకు తెరపడలేదు. ఇటీవలే జహీరాబాద్‌లో రూ.లక్ష విలువ చేసే గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్‌లోని నాలుగు పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు షాకయ్యారు. చిన్నపిల్లలను గూడా గంజాయి రొంపిలోకి దింపిన వైనంపై సర్వత్రా ఆవేదన వెల్లువెత్తుతోంది. 12, 13ఏళ్ల పిల్లలు సైతం గంజాయి ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. కంది మండలంలోని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యార్థులు విచ్చలవిడిగా గంజాయిని సేవిస్తున్నట్లు సమాచారం. రాత్రి 8 గంటలు దాటాక అటుగా వెళ్తే గంజాయి మత్తులో మునిగిపోయిన వారు అనేకమంది కనిపిస్తారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం స్పందించి గంజాయి విక్రేతలపై కఠినచర్యలు తీసుకోవాలి. చదువు, ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యాన్ని ఈ రొంపి నుంచి రక్షించాలి.

Related Posts