
వచ్చే నెల 29 వ తేదీన సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్ల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్స్ సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ తో కలసి సోమవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జులై 29 న బోనాలు, 30 వ తేదీన రంగం నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. బంగారు బోనం నమూనా ను కుడా మంత్రులు విడుదల చేసారు. సుమారు కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో ఈ బోనం తయారు చేయించడం జరుగుతుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహించడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఉత్సవాల సందర్భంగా జంట నగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, మ్మవారి ఆలయం వద్ద 9 వేదికలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.