
ఢిల్లీలో నిన్న జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా ఏపీ వాణి వినిపించారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు అన్నారు. 7 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి, సమయం అయిపోయిందని రాజ్ నాథ్ సింగ్ బెల్ కొట్టినా చంద్రబాబు 20 నిమిషాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రసంగించారని చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో ప్రధాన మంత్రి భయం, భయంగా, అసహనంతో కనిపించారన్నారు. ఏపీ అభివృద్ధికి సంఘీభావం తెలపమని, రాజధానికి నిధులు ఇవ్వాలని హెచ్చరిస్తున్న ధోరణిలో చంద్రబాబు మాట్లాడారన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థకు అనుగుణంగా ఆయన మాట్లాడారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు వద్దకు వెళ్లి రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, హుద్ హుద్ తుపాను సందర్భంగా తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్ వద్దకు కూడా అయిదుగురు ముఖ్యమంత్రులు కలసి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. చంద్రబాబు నాయుడుని దేశ వ్యాప్తంగా అభినందిస్తున్నారని చెప్పారు. ఈ అంశాలను బీజేపీ, వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసభ్య మాటలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుని అవమానిస్తూ మాట్లాడితే 5 కోట్ల ఆంధ్రులను అవమానించినట్లేన్నారు. కన్నాకు రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు పట్టవని, ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కన్నాని వైసీపీ అద్దె మైకు, బీజేపీ ఏజంట్ గా అభివర్ణించారు. చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బీజేపీవారు రాజ్యాంగ మూల సూత్రాలను పాటించడంలేదన్నారు. వైసీపీకి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ అవసరంలేదని, వారు శాసనసభను కూడా వదిలి బయట తిరుగుతున్నారని విమర్శించారు. వారికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదని, రాజకీయ ప్రయోజనాలే కావాలన్నారు. ఒకరు ఢిల్లీకి ఏజంట్ గా పని చేస్తుంటే, మరొకరు కేసుల ఎత్తివేత కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా సరే చంద్రబాబుని, రాష్ట్రాన్ని కించపరిచేవిధంగా మాట్లాడటం తగదని జూపూడి హితవు పలికారు. బిజేపీ, వైసీపీ బుద్ది తెచ్చుకోవాలన్నారు.
అశోక్ బాబుపై దాడికి ఖండన
హైదరాబాద్ లో ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు, అతని వర్గంపై జరిగిన దాడిని ఖండించారు. అటువంటి భౌతిక దాడిని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రంలో అశోక్ బాబుపై ఎవరూ దాడి చేయడానికి సాహసించలేదని జూపూడి అన్నారు