
రైతన్నలకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం సాగు సమయంలో రాయితీ విత్తనాలు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో సబ్సిడీ సీడ్స్ పంపిణీ జోరందుకుంది. ప్రభుత్వపరంగా పంపిణీ బాగానే సాగుతున్నా.. రైతులు మాత్రం ఈ విత్తనాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదని పలువురు అంటున్నారు. రాయితీ విత్తనాల్లో మేలు రకం ఉండడంలేదన్న కారణంతోనే వీటిని నాటేందుకు రైతులు అనాసక్తి చూపుతున్నారని సమాచారం. దీంతో మంచిర్యాల జిల్లాలో రాయితీ విత్తనాలు మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఉంటోందని కర్షకులు అంటున్నారు. రైతులు ఆశించే విత్తన రకాలు సరఫరా చేస్తే ఉపయోగంగా ఉంటుందని సూచిస్తున్నారు. అయితే.. అలా లేకపోవడంతో సాగుకు ప్రైవేట్ కంపెనీల విత్తనాలపైనే ఆధారపడుతున్నామని చెప్తున్నారు. వారి వాదనలో నిజం లేకపోలేదు. అయితే కొందరు వ్యాపారులు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతూ వారి భవితతో ఆటలాడుతున్నారు. ఏదైతేనేం.. రాయితీ విత్తనాలు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడని పరిస్థితి నెలకొందని రైతు సంఘం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మంచిర్యాలోనే కాక నిర్మల్, ఆదిలాబాద్ ల్లోనూ ఉందని అంటున్నారు.
నిర్మల్, ఆదిలాబాద్‌ల్లో పత్తి తర్వాత ఎక్కువ సాగయ్యేది సోయా పంటనే. దీంతో గత 20 ఏళ్లుగా సోయా విత్తనాలు రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన జెఎస్-335 రకం మాత్రమే పంపిణీ చేస్తోంది. ఈ విత్తనం కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా లేదు. దీంతో ఆయా మండల రైతులు ప్రైవేట్‌లో మహరాష్ట్ర నుంచి ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.50 లక్షల హెక్టార్లలో పంట సాగు అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 80 వేల క్వింటాళ్ళ విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. విత్తనాలు అవసరం మేరకు రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన బాసర విత్తన రకం కొంత మంది రైతులకే అందింది. దీంతో చేసేదేమిలేక రైతులు మహారాష్ట్ర నుంచి ప్రైవేట్ కంపెనీకి చెందిన విత్తన రకాలు కొనుగోలు చేసి నాట్లు వేస్తున్నారు. కంది, పెసర, మినుములు, మొక్కజొన్న విత్తనాల్లోనూ తాము ఆశించే రకాలు లేవని రైతులు అంటున్నారు. అందుకే రాయితీ విత్తనాలపై ఆధారపడకుండా ప్రైవేట్ కంపెనీలవి కొనుగోలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి మంచి దిగుబడినిచ్చే విత్తనాలకు రైతులకు రాయితీపై అందించాలని అంతా కోరుతున్నారు.