YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు సంక్షేమం కోసమే బీమా

రైతు సంక్షేమం కోసమే బీమా
రైతు శ్రేయస్సు, సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు  ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మంలో రైతులకు రైతు బీమాపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అన్ని విషయాల్లో రైతులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో విప్లవాత్మక పథకం అమలు చేయబోతోందని చెప్పారు. రైతులకు అన్నివిధాలా అండ ఉండటమే కాకుండా అనుకోని పరిస్థితుల్లో ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడిపోకుండా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 57 లక్షల మంది రైతులకు 5 లక్షల రూపాయల విలువచేసే ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. రైతు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి దుర్భర పరిస్థితులను అనుభవించకుండా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రైతులకు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.  తద్వారా రైతు సంక్షేమాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.  అయితే ఈ పథకానికి భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు కలగకుండా ఉండేందుకు గాను అధికారులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు దిశా నిర్దేశం చేసేందుకు ఈ రోజున ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
     అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన ప్రతి ఒక్క రైతు జీవిత బీమా పథకానికి అర్హులుగా తెలిపారు. రైతుకు 19 నుంచి 59 సంవత్స వయసు కలిగి ఉంటే ఈ భీమా పథకంలో చేరవచ్చన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారని తెలిపారు. తొలి విడత ప్రీమియం కింద ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. రైతులు ఈ బీమా పథకంలో చేరేందుకు ఎటువంటి వైద్య పరీక్షలు, ధ్రువపత్రాలు అవసరం లేదన్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు ఉండాలని, అందులో వయసు ప్రామాణికంగా తీసుకుని తక్షణమే బీమా పథకాన్ని అమలు చేస్తారని చెప్పారు. 
    ఖమ్మం జిల్లాలో ఉన్న 380 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతు సమన్వయ సమితి కన్వినర్లు, భద్రాద్రి కొత్తగూడెం మండల రైతు సమితి కన్వినర్లు, సభ్యులకు ఈ అవగాహనా సదస్సులో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts