
హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సమస్యలు తిష్టవేశాయి. ఆస్పత్రిలో గర్భిణులకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతాయి. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని దుస్థితి. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 100 పడకలుండగా... 170 మంది గర్భిణులకు ఇక్కడి వైద్యులు సేవలందిస్తున్నారు. కేసీఆర్ కిట్ ప్రకటన కారణంగా ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. దీంతో సమస్యలు మరింత తీవ్ర మయ్యాయి. అరకొర వసతుల మధ్యే వైద్యులు గర్భిణులకు చికిత్స అందిస్తున్నారు.గర్భిణులు ఎన్నో వ్యయప్రయసాల కోర్చి చాలా దూరం నుంచి ఆస్పత్రికి వస్తుంటారు. గంటల తరబడి ప్రయాణం చేసివచ్చిన గర్భిణులు కనీసం కూర్చుందామన్నా కుర్చీలుగానీ.. బెంచీలుగానీ లేవు. దీంతో వారంతా ఎండలోనే ఆస్పత్రి ఆవరణలోని చెట్లకింద, ఇతర ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. గర్భిణులు స్కానింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు లెదుర్కొంటున్నారు. స్కానింగ్ రిపోర్ట్‌ల కోసం సిబ్బంది మరునాడు రావాలని చెప్పడంతో.... వారు అష్టకష్టాలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఎలా రావాలంటూ గర్భిణులు ప్రశ్నిస్తున్నారు. స్కానింగ్ రిపోర్ట్‌లు వచ్చినరోజే ఇవ్వాలని కోరుతున్నారు.కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత గర్భిణుల సంఖ్య పెరిగింది. ఇది భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు లేక గర్భిణులకు సరైన వైద్యం అందడంలేదు. మూలిగేనక్కపై తాడిపండు పడ్డట్టు ఇప్పుడు గర్భిణుల సంఖ్య పెరగడంతో ఏంచేయాలో తెలియక వైద్యులు తలలుపట్టుకుంటున్నారు. కేసీఆర్ కిట్ పథకం గర్భిణులకు చేయూతనిచ్చే మంచి కార్యక్రమమే అయినా.. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అది వారిపట్ల శాపంగా మారింది. ఆస్పత్రుల్లో వసతులు పెంచకుండా కేసీఆర్ కిట్ పథకం అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వివిధ కారణాలతో ముగ్గురు వైద్యులు విధులకు రావడం లేదు. వివిధ విభాగాల్లో సరిపడ సిబ్బంది లేరు. దీంతో బాలింతలకు వైద్యం అందించడం కత్తిమీద సాములా మారింది. వైద్యులు, సిబ్బంది పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం.. వైద్యుల సంఖ్యతో పాటు పడకల స్థాయిని పెంచినప్పుడే కేసీఆర్ కిట్ పథకం లక్ష్యం నెరవేరుతుందని గర్బిణులు, వారి బంధువులు అభిప్రాయపడుతున్నారు.