
ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని, వానలు బాగా కురుస్తాయని వాతావరణ నిపుణులు స్పష్టంచేశారు. దానికి తగ్గట్లే.. జూన్ మొదటి వారం నుంచే నైరుతీ రుతు పవనాల ఎఫెక్ట్ తో వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే.. ఈ సంతోషం ఎంతోసేపు నిలువని పరిస్థితి నెలకొందని గుంటూరు రైతాంగం అంటోంది. నైరుతి రుతుపవనాలు ఉసూరు మనిపించాయని ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఏదైతేనేం.. వానలు లేకపోవడంతో జిల్లాలో ఎండలు విజృంభిస్తున్నాయి. గత వారంలో జల్లులు పడి స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గగా మళ్లీ నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వారం రోజులుగా 38 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్లతో పాటూ వేడిగాలులు పెరిగాయి. ఉష్ణోగ్ర తలు పెరగడంతో జనం వేసవి తాపంతో అల్లాడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటూ పాఠశాలలకు సెలవులు ఇచ్చారంటే.. వాతావరణ పరిస్థితి ఎలా ఉందో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా జూన్‌లో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు స్థిరంగా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లావ్యాప్తంగా వర్షపాతం సరిగాలేదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసింది. జూన్‌లో రాజస్థాన్ ఎడారిలో ఇసుక తుపాన్లు వస్తాయని, దీని వల్ల ఉత్తరాది నుంచి వచ్చే వేడిగాలులతో తేమ సాంద్రత పెరిగి వడగాల్పులు పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. దీంతో ఉష్ణోగ్రతలూ పెరిగాయని అంటున్నారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో వృక్ష సంపద లేకపోవడమూ సమస్య తీవ్రతను పెంచింది. మరోవైపు వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. సిమెంటు రోడ్లు, అపార్టుమెంట్లు నిర్మాణం జోరందుకోవడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ ప్రాంతాల్లో కనీసం మొక్కల పెంప కంపై అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో జూన్ లో కురిసే వర్షాలతో తాగునీటి కొరత తీరుతుందని గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు భావించారు. అయితే తాజాగా వేడిగాలులు, ఉష్ణోగ్ర తలతో నీటి ఎద్దడి యథావిథిగానే ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైతేనేం.. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనాలు సతమతమవుతున్నారు.