YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు 125 కోట్లు

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు 125 కోట్లు
పంచాయతీ ఎన్నికల రిజర్వేన్లపై ఉత్కంఠ నెలకొంది. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడెప్పుడా అని రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఆరంభమైన తరువాత ఒక్కసారిగా పల్లె వాతావరణం వేడెక్కనుంది. ఆగస్టు 2, 2013న కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. గడువు లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరులతో కలిసి మొత్తం ఓటర్లు 1.37కోట్ల మందికి ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దాదాపు రూ. 125కోట్లు అవసరం ఉంటుందని ఈ మేరకు ప్రభుత్వానికి నివేధికలను సంబంధిత శాఖాధికారులు అందజేశారు. ఈ నెల 25లోపు రిజర్వేషన్లు పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో అధికారులు రిజర్వేషన్లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే జిల్లాల డీ ఎల్‌పీవోలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. రిజర్వేషన్లలో కీలకమైన బీసీ గణనలో పలు తప్పులు నెలకొన్నట్టుగా ఇటీవల కాలంలో పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే  సవరణలు, మార్పులు, చేర్పులపై సమా వేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ నెల 25లోపు రిజర్వేషన్లను ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో, ఓటర్ల జాబితాలో నెలకొన్న తప్పులను త్వరితగతిన సవరించాల్సిన ఆవశ్యకతపై జిల్లాల అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది. ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ కానుందోననే సందిగ్ధం ఆశావాహుల్లో  నెలకొంది. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,734 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూలై నెలలోఎన్నికలు జరుగనున్న క్రమలో ఆయా వర్గాల నేతలు తాము పోటీ చేయదల్చుకున్న స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.25లక్షల పోలింగ్ కేంద్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయ్యింది.  ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.  2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు కానున్నట్టు సమాచారం.  దీనిప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను అమలు చేయనుండగా, బీసీలకు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుచేస్తారు. దీంతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. అన్ని కేటగిరీల్లోనూ 50శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి.    ఈ  సారి ఉపసర్పంచ్ పదవి కీలకం కానుంది. ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఉండటంతో ఇప్పటి నుంచే నేతలు  ఈ పదవిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు సర్పంచ్‌లకు మాత్రమే చెక్కుపై సంతకం చేసే అధికారం ఉండేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఉండటంతో ఈ పదవి ఈసారి ప్రధాన్యత సంతరించుకుంది.

Related Posts