
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు మరింత పకడ్బందీగా తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. పూర్వ వరంగల్ జిల్లాలో అమలవుతున్న మిషన్ భగీరథ మరియు వ్యవసాయ సంబంధిత పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశానికి గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బండ ప్రకాష్, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, చైర్మన్లు రాజయ్య యాదవ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, సంపత్, లింగంపల్లి కిషన్ రావు, వాసుదేవరెడ్డి, సీసీఎల్ఏ డైరెక్టర్ వాకాటి కరుణ, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, అమేయకుమార్, శివలింగయ్య, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గౌతమ్, జాయింట్ కలెక్టర్లు తర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వినూత్నంగా అమలు చేస్తున్న అనేక పథకాలు నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి వాటిని అధ్యయనం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నాయి. ఇంత గొప్ప పథకాలు రాష్ట్రంలో ప్రజలందరికీ అందేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో మొదటి, రెండు స్థానాల్లో ఉండేది. ఇప్పుడు ఆయా పథకాల అమలు కూడా అదేస్థాయిలో ఉండేలా అధికారులు పనిచేయాలి.జిల్లాల పునః విభజన వల్ల పరిధి తగ్గి ప్రజలకు తొందరగా చేరేందుకు సులభం అయ్యింది. రైతుబంధు పథకం రూపకల్పన నుంచి నేటి అమలు వరకు మన పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు సీసీఎల్ఏ డైరెక్టర్ గా పనిచేస్తున్న వాకాటి కరుణ క్రీయాశీలకంగా ఉన్నారు. రైతు బంధు కార్యక్రమంలో ఉన్న ఇబ్బందులను కలెక్టర్లు,అధికారులు ఆమె దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలిన పథకాలపై చర్చించుకుందామని కడియం శ్రీహరి సూచించారు.