YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

సీజనల్ టెన్షన్

సీజనల్ టెన్షన్
వేసవి తర్వాత వర్షాకాలం ప్రారంభం నుండి ఏటా వాతావరణంలోని మార్పుల నేపథ్యంలో వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. వ్యాధి సోకిన వారికి సకాలంలో సరైన వైద్యం అందకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒపి ఫీజుతో పాటు వివిధ రకాల పరీక్షలకు, మందులకు, ఇతరత్రా ఖర్చులకు రూ.వేలల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. సీజనల్‌ వ్యాధులకి తోడు అపరిశుభ్రత, కలుషిత నీరు, పరిసరాల్లో లోపించిన పారిశుధ్య నిర్వహణ వంటివి అన్నీ ఒకటై రోగాలకు కారణమౌతున్నాయి. జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, దగ్గు వంటివి త్వరితగతిన వ్యాప్తి చెందుతున్నాయి. సీజనల్‌ వ్యాధి ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తం మంచాన పట్టే దుస్థితి ఉంటోంది. దీంతో ప్రజలు ఆరోగ్య విషయమై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం తరపునా ప్రజారోగ్యంపై అధికారయంత్రాంగం దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు. 
వర్షాకాలం ప్రారంభంలో ప్రజలు ఎక్కువగా చలి జ్వరం, దగ్గు, ఆయాసం, తలనొప్పి, ముక్కుదిబ్బడతోబాధపడుతుంటారు. ఈ సమస్యలతో పలువురు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతుంటారు. కొంతమంది కార్పొరేట్‌ వైద్యం చేయించుకుంటుండగా, మరికొంత మంది ప్రయివేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లి గంటల తరబడి వేచి చూసే బదులు ఆర్‌ఎంపి వైద్యులే మేలనే భావన ప్రజల్లో నెలకొంది. దీంతో ఆర్‌ఎంపి వైద్యుల వద్ద కూడా రోజుకు వందల మంది వైద్యం చేయించుకుంటున్నారు. ఇదిలాఉంటే సర్కారీ దవాఖానాల్లో వైద్యుల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. సీజనల్‌ వ్యాధులతో ఆసుపత్రికి చేరే వారితో పాటు కొన్ని గుర్తించిన రోగాలకు ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని పెంచడంతో పాటూ సీజనల్ వ్యాధులకు వాడే మందులను జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు పూర్తిస్థాయిలో అందించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts