
అష్టా-చెమ్మ, గోల్కోండ హై స్కూల్, జెంటిల్ మెన్ చిత్రాలతో మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మోహన కృష్ణ ఇంద్రగంటి. ఆయన కలం నుంచి జాలువారిన మరో చిత్రం సమ్మోహనం. సుధీర్ బాబు, అతిధీ రావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన సమ్మోహనం సినిమాపై రీలీజ్ కి ముందే మంచి బజ్ ఏర్పడింది. అది ప్రేక్షకులకు ఇంద్రగంటిపై ఉన్న నమ్మకం అని చెప్పవచ్చు. అయితే ట్రైలర్లు, ప్రోమోలు కూడా బాగుండటంతో... ఈ సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. ఈ ఎక్స్ పెక్టేషన్స్ నడుమ ఇటీవల విడుదలైన సమ్మోహనం మంచి రెస్పాన్సే రాబట్టుకుంటోంది. కథ, కథనం విషయంలో కొత్తదనం పాటించే ఇంద్రగంటి ఈ సినిమాను కూడా విభిన్న కోణంలో తెరకెక్కించారు. సినిమా హీరోయిన్, కార్టునిస్ట్‌ల మధ్య సాగే ప్రేమాయణమే ఈ సినిమా ప్రధాన కథాంశం .శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్ బాబు, అతిథి కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అందమైన ప్రేమకథకు పి.జి వింధా మంచి విజువల్స్ ప్రెష్ లుక్ తీసుకొచ్చాయి. వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం డైలాగుల డోస్ ఎక్కువైందన్నది సినీ విశ్లేషకుల మాట. ఓవరల్‌గా మాత్రం సినిమా మంచి ప్రేమకథతో మెస్మరైజ్ చేస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ కు, తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న అతిథికి ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది. ఇంద్రగంటి సైతం ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఇప్పటికే పాజిటీవ్ టాక్‌తో ముందుకు సాగుతున్న సమ్మోహనం ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.