
పెబ్బేరులో 2013లో ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలో మొత్తం 820 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. అయిదో తరగతి నుంచి పది వరకు 500 మంది, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 320 కలిపి 820 మందికి అవకాశం ఉంటుంది. ఇంటర్‌లో మాత్రం కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చేరేందుకు మొదట ప్రవేశ పరీక్ష నిర్వహించి మండలం వారికే మొదటి అవకాశం కల్పిస్తారు. మిగిలిన సీట్లకు ఇతర మండలాల వారికి అవకాశం కల్పిస్తారు. పాఠశాల ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉటుంది. ఇంటర్‌లో అనుకున్న స్థాయిలో విద్యార్థులు చేరడం లేదు. కారణం ఇందులో చేరిన వారందరికీ హాస్టల్ వసతి లేకపోవడమే.వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, కొత్తకోట, ఖిల్లాగణపురంలో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు కావడంతో ఆయా మండలాల విద్యార్థులు ఎంతో సంతోషించారు. ఇందులో మొదటి ప్రాధాన్యం స్థానిక మండల విద్యార్థులకే ఇస్తారు. పదితో ప్రారంభించాక ఇంటర్ ప్రవేశపెట్టారు.ఇంత వరకు బాగానే ఉన్నా ఇందులో వసతి విషయంలోనే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఆదర్శ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 800 వరకు ఉన్నా.. అందులో కేవలం 100 మంది విద్యార్థులకే వసతిని కల్పించారు. మిగితా వారు పాఠశాల మాదిరిగా రోజూ ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లాల్సిందే. దీంతో ఇందులో చేరిన విద్యార్థులందరికీ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలకు కాకుండా ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం బాలికలకు మాత్రమే మొదట ప్రాధాన్యం ఇస్తారు. మిగిలితే పదో తరగతి బాలికలకు అవకాశం ఉంటుంది. వందలాది మంది విద్యార్థులున్న ఈ ఆదర్శ పాఠశాలలో కేవలం వంద మందికి మాత్రమే అవకాశం కల్పించడంపై మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇందులో చేరిన విద్యార్థులందరికీ వసతి కల్పించాలని వారు కోరుతున్నారు. రోజూ వచ్చి తిరిగి గ్రామాలకు వెళ్లాలంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతోందని వారు వాపోతున్నారు. పాఠశాల పట్టణానికి చాలా దూరంగా ఉన్నందున ప్రైవేటు వాహనాల్లో వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళుతూ ఒక విద్యార్థి ప్రమాదంలో మృతి చెందిన సంఘటన జరిగింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు బాలికలకు వసతి కల్పిస్తామని చెప్పినా.. నేటి వరకు అమలు కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ రాయిన్ ఫాతిమాను అడగ్గా.. వసతిగృహంలో సీట్లు పెంచినట్లు ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు వస్తే మిగితా వారినీ చేర్చుకుంటామని ఆమె తెలిపారు. చేరిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించాలని ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షుడు స్వారూప్‌కుమార్ డిమాండ్ చేశారు.