
ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందిస్తున్నానని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. నారాయణగూడ ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌ను గవర్నర్ నరసింహన్,వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. ల్యాబ్‌ను పరిశీలించిన అనంతరం డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్‌పై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఒక్కరికీ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ తెలిపారు. తెలంగాణలో ప్రతీ ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్.. త్వరలోనే బస్తీ దవాఖానాలను కూడా పరిశీలిస్తానని చెప్పారు.తెలంగాణ వైద్యారోగ్య శాఖ దేశంలోనే ఉత్తమమైందని కితాబిచ్చారు. సర్కార్ వైద్యాన్ని గుడ్డిగా విమర్శించడం సరికాదన్నారు గవర్నర్. ఆస్పత్రుల్లో సదుపాయాలు పరిశీలించిన తర్వాతనే విమర్శించాలని గవర్నర్ సూచించారు. మార్చురీల విషయంలో కూడా కొన్ని మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇకపై సర్కార్ దవాఖానాలపై బ్రేకింగ్ న్యూస్ ఏవీ ఉండవని భావిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. నిజంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరును స్వయంగా పరిశీలించే అభినందిస్తున్నాని గవర్నర్ స్పష్టం చేశారు. గవర్నర్ ఏం చేసినా తప్పు అన్నట్టు ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ గుడికి పోయినా రాద్ధాంతం చేస్తున్నారని నరసింహన్ ఆగ్రహం వెలిబుచ్చారు.