
గ్రేటర్ హైదరాబాద్‌లో 1466 మురికి వాడలున్నాయి. వీటిలో 18.05లక్షల మంది ప్రజలు నివాసమున్నారు. వీరిలో దారిద్రరేఖకు దిగువన ఉన్న మహిళలందరినీ స్వయం సహాయక బృందాలలో సభ్యలుగా చేసి వారిని ఆర్థికపరంగా, సామాజిక పరంగా పరిపుష్టి చేయాలని భావించిన జీహెచ్ఎంసీ పదిమంది సభ్యులతో ఒక స్వయం సహాయక మహిళా సంఘంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 46, 912 మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 46, 893 ఎస్.హెచ్.జి బృందాలలో అర్హత కలిగిన 37,611 సంఘాలకు ఈ నాలుగేళ్లుగా రూ. 1080.49 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణంగా అందచేశారు. పట్టణ ప్రాతాలు ముఖ్యంగా దేశంలోని మరే ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మహిళా సంఘాలు లేవు. ఉన్నా ఇంత పెద్ద మొత్తం రూ. 1080.49 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన దాఖలాలు లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో పది మంది సభ్యలుగా గల ఒక్కో మహిళా సంఘానికి సగటుగా రూ. 39,664 అందాయి. ఈ బ్యాంకు రుణాల వివరాలు పరిశీలిస్తే 2014-15 సంవత్సరంలో6850 మహిళా సంఘాలకు రూ. 15684.52 లక్షలు రుణంగా అందచేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 10036 సంఘాలకు రూ. 26499.48 లక్షలు, 2016-17 సంవత్సరంలో 10,090 సంఘాలకు రూ. 29,220.36లక్షలు, 2017-18లో 10,018 సంఘాలకు రూ. 34192.92 లక్షలు అందచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో 10,690 మహిళా సంఘాలకు రూ. 32022.29 లక్షలను రుణాలందించడానికి లక్ష్యం నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 617 సంఘాలకు రూ. 2447.25లక్షలను బ్యాంకు లింకేజీ కల్పించారు.
గ్రేటర్‌లోని మహిళలకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇప్పించడంతో పాటు స్వయం సహాయక మహిళలు తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులకు ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటి విక్రయాలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా జీహెచ్ఎంసీ కల్పిస్తోంది.
నగరంలో ఉన్న ఎస్.హెచ్.జి లో 15 నుండి 25 మద్య గ్రూపులు కలిసి ఒక స్లమ్ లేవేల్ ఫెడరేషన్లుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం నగరంలో 1,049 ఎస్.ఎల్.ఎఫ్‌లు ఉన్నాయి. సర్కిల్‌లో ఉన్న స్లమ్‌లేవల్ ఫెడరేషన్లు (బస్తీస్థాయి) అన్ని కలిసి 29 టౌన్‌లేవల్ ఫెడరేషన్లు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన స్వయం సహాయక బృందం ఆరు నెలలపాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ఆ గ్రూపుకు మొదటగా 75,000 రూపాయలను రుణంగా అందిస్తున్నారు. అనంతరం రెండో సారి లక్షన్నర, మూడో సారి మూడు లక్షల రూపాయలు ఆ గ్రూపుకు అందిస్తున్నారు. ఏవిధమైన అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా కట్టే గ్రూపులకు గరిష్టంగా 10లక్షల రూపాయలను కూడా రుణాలను అందజేసిన కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ నిలిచింది. సీనియర్‌గా ఉన్న గ్రూపుకు రికార్డు స్థాయిలో రూ. 14.50లక్షలను కూడా అందజేశారు. స్వయం సహాయక సంఘాలవారు తమ సంఘం యొక్క సూక్ష్మ ఆర్థిక ప్రణాళిక ప్రతిపాదనలను సరించి బ్యాంకు వారు తగిన రీతిలో రుణాలను అందజేస్తున్నారు.
క్రమం తప్పకుండా పొదుపు చేయడం, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన మహిళా సంఘాల సభ్యులకు ఆహార పదార్థాల తయారీ, బట్టల తయారీ, డయ్యింగ్, ప్రింటింగ్, హెర్బల్ ఉత్పత్తుల తయారీ తదితర రంగాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాన్ని కూడా అందజేస్తోంది.
కేవలం పొదుపు, ఆర్థిక అభివృద్ది రంగంలోనే కాకుండా నగరంలో 46,893 మహిళా సంఘాలను స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగస్వాములను జీహెచ్ఎంసీ చేస్తోంది. ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేరు చేయడంలోనూ, తమ సమీపంలోని నాలాలు, చెరువుల్లో వ్యర్థపదార్థాలను వేయకుండా నగరవాసులను చైతన్యం చేయడం, కుటుంబాలను కలపడం, చెత్తను వేరు చేయడం, వేడుకల్లో దుబార ఖర్చులు నివారించడం, తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపివ్వడం, హరితహారం తదితర సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా జీహెచ్ఎంసీ మహిళా సంఘాల సేవలను ఉపయోగించుకుంటుంది. మహిళలకు ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తుంది.