
వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని, వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి జీ. మాధవీలత సీఎం కేసీఆర్ ను ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించక పోవడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానాన్ని నిర్మూలిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీనిచ్చారని గుర్తు చేశారు. సుప్రీంకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, విదేశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకే అధిక జీతాలిస్తారని, అలాగే మన దేశంలోనూ చెల్లించాలన్నారు.2వ ఏఎన్ఎంలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరం తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమం చేస్తామన్నారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తే చేయాలని సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఇతర డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాధవీలత సీఎం కేసీఆర్ ను కోరారు.