
నానాటికీ పెరుగుతున్న నీటి కాలుష్యం తీరును అంచనా వేసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించే పరీక్ష కేంద్రాల్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు ప్రాంతాల్ని ఇందుకోసం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో రెండు చోట్ల, జగిత్యాల జిల్లాలో రెండు చోట్ల, సిరిసిల్ల జిల్లాలో ఒకచోట వీటి ఏర్పాటునకు పది రోజుల కిందటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోద ముద్ర వేసింది. కరీంనగర్ పట్టణంలోని దిగువ మానేరు పరివాహక ప్రాంతంలో చెత్తను నిల్వ చేస్తున్న చోటు, కొండగట్టు దేవాలయంలోని కోనేరు చెంతన, వేములవాడ ఆలయ చెరువు సమీపంలో, ధర్మపురి దేవాలయం వద్ద, కరీంనగర్ దిగువ మానేరు డ్యాం వద్ద నీటి తనిఖీ పరీక్షల్ని జరిపేందుకు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నీటి నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం(ఎన్‌డబ్ల్యూఎంపీ)లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 70 కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు ప్రాంతాలకు అవకాశం కల్పించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాతోపాటు మిగతా ప్రాంతాల్లో మరో ఐదారు చోట్ల వీటి ఏర్పాటు తప్పని సరి అనే వాదన సంబంధిత అధికారుల నుంచే వినిపిస్తోంది. ముఖ్యంగా బొగ్గు అధికంగా ఉండే గోదావరిఖని, రామగుండం లాంటి ప్రాంతాల్లో నీటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు జిల్లాలోని పలు మురుగు నీటిని శుద్ధి చేసే విధానాలపై నగరపాలక సంస్థలు, పురపాలికలు సరైన దృష్టి సారించకపోవడం, గ్రామస్థాయిలోనూ రోజురోజుకు వెలువడుతున్న వ్యర్థజలాల తీరు పెరగుతుండటం వల్ల ఇబ్బంది కనిపిస్తుంది. రసాయన పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతరత్రాల మూలాలు మిళితమై అనారోగ్య పరిస్థితులు ప్రజలకు పలుచోట్ల చేరువవుతున్నాయి. దీనికితోడుగా సరైన పారుదల వ్యవస్థ లేక వ్యర్థజలాలు తాగునీటిలో కలుషితమై కలవర పరుస్తున్నాయి. అందుకే మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆక్సిజన్ శాతంతోపాటు టీడీఎస్, సీఓడీ, కఠినత, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్స్, నైట్రేట్స్, ఐరన్ మొదలగువాటి శాతాల్ని పరీక్షల్లో తేల్చి అవసరమైన చర్యల్ని తీసుకోవాల్సిన అవసరముంది.జిల్లాలో తీవ్రత అధికంగా ఉన్న ప్రదేశాల్ని గుర్తించిన అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ గరళంగా మారుతున్న జలం తీరును అంచనా వేయనున్నారు. అసలైన ప్రమాణాల్ని తేల్చి చూపడంతోపాటు అవసరమైన చర్యల్ని తీసుకునేలా నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న ముప్పు నుంచి గట్టెక్కించాలనే ప్రయత్నం ఇప్పుడిపుడు అమలు దిశగా అడుగులు వేయబోతోంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో వెలువడే కాలుష్యంపై కచ్చితమైన కొలమానాలు లేక ఇబ్బంది కనిపించింది. తాజాగా వీటి ఏర్పాటు వల్ల జల కాలుష్యం తీరు ఎలా ఉందనే కచ్చితత్వాన్ని తెలుసుకునే వీలుండనుంది. కలుషిత జలం తీరుతో ఎదురయ్యే కష్టాలనుంచి ప్రజలకు ఇక మీదట కాస్త ఉపశమనం లభించనుంది.భూగర్భ జలం విషతుల్యంగా మారుతున్న తీరుపై ఎట్టకేలకు కాలుష్య నియంత్రణ(పీసీబీ) అధికారులు దృష్టి పెట్టారు. 30లక్షలకుపైగా జనాభా ఉన్న నాలుగు జిల్లాల పరిధిలోని పట్టణాల చెంతన ఉన్న చెరువులు, కుంటలు కొన్నేళ్లుగా మురుగు తీరుతో కలుషితమవుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లాంటి పట్టణంలో జలకాలుష్యం తీరు ప్రమాదకరస్థాయికి చేరిందనే తీరు గతంలోనే అధికారులు గుర్తించారు. నిర్దిష్టమైన ప్రమాణాల్ని గుర్తించే ప్రయత్నాల్ని చేశారు. చెత్త డంపింగ్ యార్డు సహా నగరానికి ఆనుకునే వెళ్తున్న మానేరు నది కాలుష్య కాసార నీటిని మోసుకెళ్తున్న విషయాన్ని గుర్తించారు. దీనికి తోడుగా నివాస ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు నీరులోని వ్యర్థాల వల్ల భూగర్భ జలాలకు తీరని ముప్పు వాటిల్లుతోంది. విషతుల్యమైన నీరు భూగర్భంలోకి ఇంకటంతో అక్కడి జలాల్లో ఆమ్ల పరిణామం అనూహ్యంగా పెరిగి దారుణమైన స్థితికి చేరుకుంటుంది. ఏళ్లతరబడి కనిపిస్తున్న ఈ ఇబ్బంది ఇటీవల కాలంగా అధికమమైంది. నామ మాత్రపు పర్యవేక్షణలతో సంబంధిత అధికారులు పట్టింపులేని తీరును చూపించారనే ఆరోపణలు ప్రజాప్రతినిధులు, పర్యావరణ వేత్తలనుంచి వినబడ్డాయి. పర్యావరణానికి జలకాలుష్యం వల్ల కలిగే విఘాతాలపై సరైన దృష్టి సారించలేదనే విమర్శలు అక్కడక్కడ వినిపించాయి. పక్కాగా నీటి నాణ్యత పరిస్థితులపై అధ్యయనం చేయకపోవడం వల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల చెంతన నీటి తీరు అధ్వానంగా మారిన ఉదంతాలున్నాయి. పట్టణాల్లోని జనావాసాల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నదులు, వాగులు, చెరువుల్లో కలుస్తూ నీటి స్వచ్ఛత విషయంలో ప్రమాణాలు దెబ్బతిన్నాయి. రైతులతోపాటు మత్స్యకారులకు తీరని నష్టాన్ని ఆయా సందర్భాల్లో ఎదుర్కొన్నారు. ఎగువ, దిగువ మానేరు జలాశయాల సమీపంలోని నీటి నిల్వ ప్రాంతాలు, చెరువుల్లో వ్యర్థజలాలు కలిసిన మూలంగా లక్షలాది చేపలు మృతి చెందిన సందర్భాలు జిల్లాల్లో ఉన్నాయి.