YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నష్టనివారణ చర్యల్లో బిజూ పట్నాయక్

నష్టనివారణ చర్యల్లో బిజూ పట్నాయక్
నవీన్ పట్నాయక్…పరిచయం అక్కరలేని పేరు. మూడు దఫాలుగా పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన నవీన్ పట్నాయక్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒడిషా లో నవీన్ పట్నాయక్ కు ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దెబ్బతినడం, బీజేపీ పుంజుకోవడంతో వచ్చే ఎన్నికల్లో రసవత్తర పోరు జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం బీజేపీ సత్తా చాటడంతో నవీన్ పట్నాయక్ బీజేపీని నిలువరించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆయన ఎన్నికల వ్యూహ రచనను ఇప్పటి నుంచే ప్రారంభించారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు.నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకమైనప్పటికీ ఆయన ఎప్పుడూ తీవ్ర స్థాయి విమర్శలు చేయకపోవడం విశేషం. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సయితం ఆయన రాష్ట్ర సమస్యలకే పరిమిత మయ్యారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో సమావేశానికి కూడా ఆయన ఇష్టపడలేదు. తన రాష్ట్రం…తన పార్టీ అదే నవీన్ నినాదం. అందుకోసమే నవీన్ పట్నాయక్ ను విపక్షాలు సయితం తమతో కలుపుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ప్రస్తుతం ఒడిషాలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న విశ్లేషణలు బయటకు వస్తున్నాయి.తండ్రి బిజూపట్నాయక్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ కు రెండు దశాబ్దాల నుంచి పార్టీని నడుపుతున్నారు. పార్టీకి అప్రహత విజయాలను అందిస్తున్నారు. అలాంటి నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. బీజేపీ బలంగా పుంజుకోవడంతో నవీన్ కు చెమటలు పడుతున్నాయంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుపోవడం, సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయలేకపోవడం, దీర్ఘాకాలమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పెండింగ్ లో పడిపోవడం నవీన్ కు మైనస్ గా చెబుతున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా చేస్తున్న పరిపాలనపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని అంతర్గత సర్వేల్లో తేలడంతో నవీన్ నష్టనివారణ చర్యలకు దిగారు.ఒడిషా ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న ఒడిషాలో మరోసారి అధికారం చేపట్టాలని నవీన్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మొత్తం 147 స్థానాలున్న అసెంబ్లీలో ఈసారి మోడీ వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని నవీన్ భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీ చీల్చుకుంటే తమకు లాభమేనని బిజూ జనతాదళ్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఒడిషాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అసెంబ్లీతో పాటు లోక్ సభలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో తరచుగా అమిత్ షా ఒడిషా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకూడా పర్యటించి వెళ్లారు. మొత్తం మీద ఈసారి నవీన్ క గెలుపు అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts