YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాయకల్ప చికిత్సపై కాంగ్రెస్ ప్రణాళికలు

కాయకల్ప చికిత్సపై  కాంగ్రెస్ ప్రణాళికలు
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో అంతటి ఘోరపరాజయం మునుపెన్నడూ ఎదురుకాలేదు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండానే కొత్త రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమైంది. చట్టసభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవహారాలు సాగించడం, ఉద్యమాలు నడపటం సాధ్యం కాదు. దీంతో  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముకున్న చందంగా తయారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీని 2019 ఎన్నికల దిశగా నడిపించేందుకు అవసరమైన కాయకల్ప చికిత్స చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ సంకల్పించారు.
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీని ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన ఉమెన్‌చాందీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆంధ్రరత్న భవన్‌కు వచ్చాక ఏపీకి చెందిన ముఖ్య నేతలంతా ఆయనను కలుసుకున్నారు. పార్టీ పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్లుగా చంద్రబాబు రాష్ట్రానికి ఏమిచేశారో చెప్పారు. జగన్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ పోరుబాట వంటి అంశాలను కూడా పూసగుచ్చారు. అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఉమెన్‌చాందీ దృష్టి సారించారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను పిలిపించారు. దీంతో ఆయా జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు చాలా రోజుల తర్వాత ఆంధ్రరత్న భవన్‌లోకి అడుగుపెట్టినట్టయ్యింది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరెవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేశారు? అన్న విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది నేతలు వైకాపాలోకి వెళ్లిన అంశాన్ని కూడా గమనించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను కూడా స్థానిక నేతలు ఉమెన్‌చాందీకి వివరించారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక ఉమెన్‌చాందీ ఓ సూచన చేశారు. ముందుగా క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నియమించాలంటూ జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆయన కర్తవ్యబోధ చేశారుబూత్ కమిటీలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. పార్టీ సానుభూతిపరులను పోలింగ్ బూత్‌లకు తీసుకువచ్చి ఓట్లు వేయించేది బుత్‌ కమిటీలేనని ఉమెన్‌చాందీ గుర్తుచేశారు. ఆయన ప్రసంగం, సూచనలు విన్న తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అంతే తాపీగా ఓ విషయం ఆయన దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నేతల సంఖ్య స్వల్పంగా ఉందనీ,  కార్యకర్తలంతా వైసీపీలో వెళ్లిపోయారనీ చెప్పారు. ఇలాంటి స్థితిలో బూత్ కమిటీలు వేయడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఏపీలోని కొన్ని గ్రామాల్లో అయితే పార్టీ జెండా ఎగురవేసే దిక్కు కూడా లేదని స్పష్టంచేశారు. దీంతో ఉమెన్‌చాందీకి ఏపీలో పార్టీ పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థమైంది.  పార్టీ బాధ్యుడుగా ఆయన మరో సూచన కూడా చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్‌గాంధీ చేసిన ప్రకటనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ ఉమెన్‌చాందీ సూచించారు. ఈ సూచనపై కూడా స్థానిక కాంగ్రెస్‌ నేతలు సానుకూలంగా స్పందించలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లో ప్రస్తావిస్తే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారనీ, తమ మనోభావాలకు విరుద్ధంగా ఎందుకు రాష్ట్ర విభజన చేశారని నిలదీస్తున్నారనీ ఉమెన్‌చాందీకి చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో ఉమెన్‌చాందీ ఇంకో మాట అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు ఎవరైనా అక్కడ అసంతృప్తిగా ఉంటే.. వారిని సంప్రదించాలనీ, మన పార్టీలోకి ఆహ్వానించాలనీ చెప్పారు. ఈ మాటపై కూడా చిటపటలే రేగాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేవారు ఎవరూ లేరనీ, ఉన్న నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లకుండా కాపాడుకోవడమే అతిపెద్ద బాధ్యత అనీ స్పష్టంచేశారు. ఇదండీ రాష్ట్రానికి వచ్చిన ఉమెన్‌చాందీకి ఎదురైన అనుభవం. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయడానికి అభ్యర్థులే దొరకని తరుణంలో బూత్‌ కమిటీలకు జనాన్ని ఎక్కడ పోగేస్తామన్నది ఏపీ నేతల సందేహం. మరి దీనిపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ స్పందన ఎలా ఉంటుందో, ఉమెన్‌చాందీ వచ్చే రోజుల్లో ఏపీ కాంగ్రెస్‌కి ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి! 

Related Posts