
శ్రీవారి సన్నిధికి సంబంధించిన విషయమై వివాదాలు కొనసాగుతుండడంపై పీఠాధిపతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరోపణల పర్వానికి స్వస్తి పలికి సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు తొలి ప్రయత్నంగా ఈ నెల 9నే పలువురు పీఠాధిపతులు తిరుమలలో సమావేశమయ్యారు. మరోసారి సమావేశమవుతామని.. ఈ విషయమై ఎవ్వరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. అయితే.. రమణ దీక్షితులు విమర్శలు చేస్తుండడంతో టీటీడీ సైతం దీటుగా స్పందించింది. రూ.100కోట్లకు పరువునష్టం నోటీసు పంపింది. దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లైందని పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమస్య కొలిక్కిరాదు. వివాదం మరింత జటిలమవుతుంది. సామరస్యంగా చర్చించుకుంటే వివాదాలు పరిష్కారమవుతాయి. రమణదీక్షితులు లాంటి సీనియర్ అర్చకులకు ఈ విషయం తెలియంది కాదు.
ఈ వివాదాన్ని పెద్దది చేయొద్దని.. పరిష్కారం కోసం యత్నిద్దామని పీఠాధిపతులు సూచించినా రమణ దీక్షితులు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. టీటీడీపై ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం స్వామివారికి సంబంధించిన అంశమని కమలానంద భారతి స్వామీజీ తేల్చి చెప్పారు. దీనిపై ఏ రాజకీయ పార్టీగానీ, ఎవ్వరూ గానీ ఇక ఏమీ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. సమాజాన్ని ఉద్రేకపరచే విధంగా వ్యవహరించాలన్న ఆకాంక్ష తమకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. ఆయన ఇంత బాగా చెప్పినా.. రమణ దీక్షితులు మళ్లీ విమర్శల పరంపర ప్రారంభించడంపై భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి వివాదాల్లోకి రావడంతో భక్త కోటి ఆవేదనలో మునిగిపోయింది. టీటీడీ-రమణదీక్షితుల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతుండడంతో.. తిరుమల ప్రాశస్త్యం మసకబారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏదైమైనా తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు అంతా కృషి చేయాలి. ఆరోపణలకు స్వస్తి పలికి దేవదేవుడి సన్నిధానం పవిత్రతకు రక్షణగా ఉండాలి.