
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతకుముందు సెక్యూరిటీ సిబ్బంది వెంట వస్తుండగా చంద్రబాబునాయుడు ఆలయంలోకి ప్రవేశించారు. అదేసమయంలో ఆ పక్కనుంచి పవన్ కళ్యాణ్ వెళ్లారు కానీ ముఖ్యమంత్రిని పలుకరించలేదు. ఇటీవల కాలంలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ తీవ్ర. ఆలయం వెలుపల ఉన్న టీవీ విజువల్స్ లో వీరు పలకరించుకోకపోవడం కనిపించింది. అయితే, లోపలకు వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించిన విజువల్స్ మాత్రం కెమెరా కంటికి చిక్కలేదు. ఈ సందర్భంగా మంత్రులు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పవన్ కల్యాణ్ అనుచరులు కూడా వారితో పాటు ఉన్నారు. వీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు పలకరించుకున్న విషయాన్ని వెల్లడించారు.
ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో నవధాన్యాలను ఉంచే సమయంలో చంద్రబాబు నవ్వుతూ పక్కన వున్న పవన్ ను పలకరించారు. దీనికి స్పందనగా 'ఎలా ఉన్నారు?' అంటూ చంద్రబాబును పవన్ కల్యాణ్ కుశల ప్రశ్న వేసినట్లు సమాచారం. బాగున్నాను అంటూ చంద్రబాబు జవాబిచ్చారు. మీరెలా ఉన్నారు? అంటూ పవన్ ను ప్రశ్నించారట.