YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మొహం చాటేసిన వరుణుడు

మొహం చాటేసిన వరుణుడు
వరుణుడు మురిపించి మొహం చాటేశాడని పెద్దపల్లి రైతాంగం ఆవేదన వ్యక్తంచేస్తోంది. జూన్ మొదటివారంలో వానలు బాగానే కురిసినా.. ప్రస్తుతం చినుకు జాడే లేకుండా ఉందని వాపోతోంది. వాస్తవానికి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో పోల్చితే.. పెద్దపల్లి పరిస్థితి కొంత మెరుగే. ఈ మూడు జిల్లాల్లో ఆశించిన వర్షపాతం నమోదుకాలేదు. దీంతో విత్తనాలు నాటుకున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. బిందెలతో నీళ్లు తెచ్చి.. విత్తనాలు భూమిలోంచి పైకి తేలకుండా జాగ్రత్తగా నీటిని చల్లుకుంటున్నారు. వానలు కురిస్తే.. రైతన్నలకు ఈ పాట్లు తప్పి ఉండేవి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. అయితే వానలు సరిగా లేకపోవడంతో వరినాట్లు వేయడం కష్టంగా మారింది. మొక్కజొన్న పంటలతోపాటు వేసిన పత్తి పంటలకు ఇప్పటికే నీటి తడిలేక రైతులు వానల కోసం రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  
నాలుగు జిల్లాల పరిధిలో మొత్తంగా 61 మండలాల్లో 28 మండలాల్లో మాత్రం కనీసం 50శాతం మేర కూడా చిన్నపాటి వర్షం కురవలేదు. జగిత్యాలలోని 7 మండలాల్లో 50శాతానికిపైగా లోటు ఉందని రైతులు అంటున్నారు. కరీంనగర్‌లోని 6 మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11 మండలు, పెద్దపల్లి జిల్లాలో 4 మండలాల్లో ఆశించిన వర్షపాతం లేదని స్పష్టంచేస్తున్నారు. అంచనా వేసిన వర్షపాతంలో సగాన్ని కూడా మించలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పంటలకు నష్టమేనని రైతులు అంటున్నారు. ఇదిలాఉంటే మిగతా జిల్లాలతో పోల్చితే పెద్దపల్లి జిల్లాలో పరిస్థితి కొంత ఫర్వాలేదు. ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షానికి దరిదాపులోనే వర్షం కురిసింది. అత్యధికంగా మంథని, ముత్తారం,శ్రీరాంపూర్‌, రామగిరి, కమాన్‌పూర్‌లలో ఒక మోస్తారు వర్షాలు పడ్డాయని వాతావరణవిభాగం అధికారులు చెప్పారు. ఈ జిల్లా పరిధిలో ఎలిగేడ్‌(65శాతం), పాలకుర్తి(59శాతం), ధర్మారం(53శాతం), అంతర్గాం(51శాతం) మాత్రం లోటు వర్షపాతం కనిపించిందని వివరించారు.  

Related Posts