YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జమిలి సాధ్యమేనా?

జమిలి సాధ్యమేనా?
రెండున్నరేళ్లుగా.. దేశంలో ఎన్నికలకు సంబంధించి జమిలీ అనే మాట జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ.. తరచూ జమిలీ ఎలక్షన్స్ ను ప్రస్తావిస్తున్నారు. మొన్నటి నీతి ఆయోగ్ సామావేశంలోనూ ముఖ్యమంత్రులతో ఈ ఇష్యూపై మాట్లాడారు. అభివృద్ధిని పరుగులు తీయించాలన్న తన లక్ష్యానికి తరచూ ఎన్నికలవల్ల గండి పడుతోందని మోదీ గట్టిగా భావిస్తున్నారు. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. నోటిఫికేషన్‌ నుంచి పోలింగ్‌ ముగిసి ఫలితాలు వెలువడేదాకా ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఈ సమయంలో… ఆయా రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ఎలాంటి విధాన నిర్ణయాలూ తీసుకోలేదు. అంటే… అభివృద్ధికి కళ్లెం పడినట్లే. జమిలితో ఈ సంకెళ్లు తెగుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, ఒడీశా ప్రభుత్వాల పదవీకాలం వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ముగియనుంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్.. వచ్చే ఏడాది మార్చ్ ల మధ్య దాదాపు 8 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికలను అడ్జస్ట్ చేసి.. జమిలితో కనెక్ట్ చేసే ఇష్యూను పరిశీలిస్తోంది కేంద్రం. 
జమిలిలో ప్రధాన సమస్య వ్యవధికి ముందే ప్రభుత్వాలు రద్దు అయ్యే అవకాశం. ఈ పరిస్థితి ఉత్పన్నమైతే.. ఏ పార్టీ జమిలికి ఒప్పుకోదు. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. కాకపోతే.. 2014నుంచి 2017 వరకూ.. జరిగిన ఎన్నికల్లో.. పైచేయి సాధించారు కాబట్టి.. మోడీ జమిలి సిస్టమ్ పట్ల మొగ్గుచూపి ఉండొచ్చు. దేశంలో పార్టీ పట్టు పెంచవచ్చని భావిస్తుండవచ్చు. అయితే.. గతేడాది లేదా ఇటీవలే వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన సర్కార్లను జమిలి కోసం రద్దు చేసే పరిస్థితి వస్తే మాత్రం.. ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీలు అంగీకరించవు. వాటి పదవీ కాలం పొడిగిస్తామన్నా సమస్యే. ఎందుకంటే.. విపక్ష పార్టీలు ససేమిరా అంటాయి. కాబట్టి జమిలి నిర్వహణకు ప్రాంతీయ పార్టీల నుంచి పెద్దగా మద్దతు రాకపోవచ్చన్నది విశ్లేషకుల భావన. జమిలి రూల్స్ తో ఐదేళ్లు అధికారం చెలాయించే గ్యారంటీ కొన్ని ప్రభుత్వాలకు లభించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. 
ఒకే దేశం..ఒకే ఎన్నిక కచ్చితంగా అధికార పార్టీకే లాభం అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ తరహా ఎన్నిక వచ్చిందంటే.. అధికార పార్టీపూర్తిగా సన్నద్ధమై ఉన్నట్లే. ప్రతిపక్షాలు చతికిలపడి ఉంటాయి. దేశమంతా ఆ పార్టీలు ఖర్చుచేసి గెలిచే పరిస్థితి ఉండదు. గతంలో కేంద్రంలోనూ ఒకటి రెండు తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జమిలి ఎన్నికలు సాధ్యమయ్యాయి. అంటే జాతీయ పార్టీల బలోపేతమే జమిలి లక్ష్యంలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం పెత్తనం పెరిగిపోయే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయని అంటున్నాయి. ఎందుకంటే.. ప్రజలు ఒకేసారి కేంద్రరాష్ట్రాల్లోని పార్టీలకు ఓటు వేయాలి. ఈ వ్యత్యాసం గుర్తించిన వారు జాగ్రత్తగా ఓటు వేసినా.. చాలామంది.. ఇరుచోట్లా.. ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. ఇలాంటి ఎన్నికల్లో నేషనల్ ఇష్యూలే ఇంపార్టెన్స్ సంతరించుకుంటాయి. దీంతో కేంద్రంలోని ప్రధాన పార్టీలకే.. ఓట్లు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. ఏదేమైనా రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు దాటి.. జమిలి సిస్టమ్ ఆచరణలోకి వస్తుందో లేదో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related Posts