YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్యాలెట్ జోరు

బ్యాలెట్ జోరు
పంతాయతీ ఎన్నికల హంగామా నిజామాబాద్ జిల్లాలో పుంజుకుంటోంది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకోవడంతో గుర్తుల ముద్రణ కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి టెండర్ కూడా పూర్తైందని అధికారులు సైతం నిర్ధారించారు. ఇదిలాఉంటే జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్ల వారీగా పోలింగ్ చేపట్టనున్నారు. మొత్తం ఎన్నికలకు అవసరమైన ఆరు వేల మంది సిబ్బంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. స్టేజీ-1, స్టేజీ-2, ప్రిసైడింగ్‌ అధికారులను కూడా నియమించారు. ఇప్పటికే వీరికి ఒకసారి శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక 3,500 బ్యాలెట్‌ పెట్టెలకు మరమ్మతులు చేపట్టి రెడీ చేస్తున్నారు. మరోవైపు బ్యాలెట్‌ పేపర్లపై గుర్తులను, వరుస నెంబర్లను ముద్రణ ఏర్పాట్లను చూసేందుకు ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్‌ ద్వారా ముద్రణ దక్కించుకున్న ప్రింటింగ్‌ ప్రెస్‌ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఉంచుతారు. పోలీస్‌ బందోబస్తు మధ్యే రహస్యంగా ప్రింటింగ్ చేపట్టనున్నారు. 
 
ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఒక ఈవోపీఆర్డీతో పాటు ఆరుగురు పంచాయతీ కార్యదర్శులు ఉంటారని సమాచారం. ఇలా ఎనిమిది ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఇదే స్థాయిలో సిబ్బంది ఉండి ఎలాంటి అవకతవకలు సాగకుండా పర్యవేక్షించనున్నారు. ప్రింటింగ్ ప్రెస్ లో ఉండేందుకు ఉన్నతాధికారులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు, మరో బృందం సాయంత్రం నుంచి రాత్రి వరకు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారని అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో ముద్రణ పూర్తవుతుందని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో అతి కీలకమైన ఘట్టం రిజర్వేషన్ల ప్రక్రియ. పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్ల సంఖ్యను ఇప్పటికే నిర్ణయించారు. ఇక జిల్లాల వారిగా ఏయే వర్గాలకు ఎన్నేసి స్థానాలను ఇవ్వాలనేది పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నిర్ణయించి ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం త్వరలోనే కొలిక్కిరానుంది. ఏదైతేనేం.. స్థానిక ఎన్నికల ప్రక్రియ జోరందుకోవడంతో.. ఆశావహుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.

Related Posts