YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిల్వ వెతలకు సెలవు!

నిల్వ వెతలకు సెలవు!
రైతుల సంక్షేమం కోసమే కాక వ్యవసాయ సమస్యలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలిగా అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందుల్లో గోడౌన్ల కొరత ఒకటి. పంట చేతికి అందినా.. నిల్వ చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక.. రైతులు.. నానాపాట్లు పడుతున్నారు. ఇక ప్రభుత్వం కూడా రైతుల నుంచి సేకరించిన పంటను నిల్వ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మెదక్ జిల్లాలోని వట్ పల్లి వద్ద గోడౌన్ ఏర్పాటుచేశారు. ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోడౌన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది సర్కార్. 2015 మేలో 2500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన ఆధునిక వ్యవసాయ గోదాం ఏర్పాటుకు నాబార్డు నిధుల ద్వారా ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. టెండర్దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో రైతులే కాక అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పాటూ అధికారులు, నేతల ఒత్తిడి మేరకు గోదాం నిర్మాణం పనులు దాదాపు కొలిక్కివచ్చాయి. ఖరీఫ్‌ పంటల దిగుబడి సమయానికి ఈ గోదాంను ప్రారంభిస్తే రైతులకు మేలు కలుగుతుందని అంతా అంటున్నారు. 
స్థానికంగా వేలాదిమంది రైతులు ఉన్నారు. ఇక రేగోడ్‌ మండలంలోనే దాదాపు 8వేల మంది రైతులు ఉన్నారు. దీంతో వానాకాలం పంట చేతికొచ్చే నాటికి గోదాం అందుబాటులోకి వస్తే పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించే వరకు నిల్వ చేసుకోవచ్చని అంతా సూచిస్తున్నారు. వాస్తవానికి రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి సరైన వసతులు లేక అద్దె గదులు ఆశ్రయిస్తున్నారు. నిల్వ సౌకర్యం లేకపోవడంతో వారు నానాపాట్లు పడుతున్నారు. పంట తమ వద్ద ఉంచుకుంటే పాడైపోతుందన్న భయంతో తక్కువ ధరకే విక్రయించేవారు. గోదాం వినియోగంలోకి వస్తే రైతులకు ఈ ఇబ్బందులను తొలగిపోయే అవకాశం ఉంది. గోదాం నిర్మాణ పనులు పూర్తి కావడంతో రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఇటీవల రూ.26.50 లక్షలు మంజూరు అయ్యాయి. దీంతో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది. ఖరీఫ్‌ పంటలు చేతికొచ్చే సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేస్తోంది. 

Related Posts