YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముందస్తుకు సిద్ధమౌతున్న తెలంగాణ

ముందస్తుకు సిద్ధమౌతున్న తెలంగాణ
దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయా? 2018 నవంబర్-డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు చూస్తే ఇదే అనుమానం కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పార్టీ నేతలు, శ్రేణులను సన్నద్ధం చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రెండు రోజుల కిందట పాత వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో అధికారులను సన్నద్ధం చేస్తూ ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. దీంతో ఈ వార్తలు జోరందుకున్నాయి. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించడంతో అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ నడుస్తోంది. వాస్తవానికి 2019 ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాలి. కానీ, అంతకంటే నాలుగైదు నెలల ముందే ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొంత మంది కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. అంతేకాకుండా లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది నరేంద్ర మోదీ ఆలోచన. గత కొంత కాలంగా ఆయన దీన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే అంశాన్ని చర్చించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మరోసారి కోరారు. దీన్ని బట్టి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కర్ణాటకతో పాటు ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఆదరణ లభించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ప్రజల్లో ఆదరణ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలనే భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమదే అధికారం అనే ధీమా కమలం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముందస్తు ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన దేశ రాజధాని నుంచి తిరిగొచ్చిన తర్వాత సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మంత్రులు, పార్టీ శ్రేణులను ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ పర్యటనలో కడియం శ్రీహరి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నవంబర్-డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఆలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని పలువురు మంత్రులు ఆయా జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రాజకీయ ఎత్తుల్లో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే చంద్రబాబు నాయుడు.. టీడీపీ శ్రేణులను ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేశారు. ఆయన సభలు, సమావేశాలు కూడా ఎన్నికల సభలను తలపిస్తున్నాయి. బీజేపీ, వైసీపీకి చెక్ పెట్టడానికి అన్ని మార్గాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌తోనూ చర్చించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కొంత మంది నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే పవన్‌తో సంప్రదింపులు జరిపారని, గుంటూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారని మరి కొంత మంది చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా.. జరుగుతున్న పరిణామాలు, రాజకీయ సమీకరణలు చూస్తుంటే, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలకే మొగ్గు ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్‌సభకు ఎన్నికలు జరిపే ఆలోచన ఉన్నా.. ఒకే దఫాలో ఆ కల సాకారం కాదు. దీనికి పలు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసొచ్చినా.. రాకున్నా ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 

Related Posts