
తమిళనాడుపై మోడీకి మోజు ఎక్కవయిందా. వచ్చే ఎన్నికలను తమిళనాడును మోడీ టార్గెట్ చేశారా? పార్లమెంటు స్థానాలను అన్నాడీఎంకేతో కలసి పంచుకునేందుకు రెడీ అయిపోయారా? అందుకే తమిళనాడు మీద ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారు. మిత్ర పక్షాలన్నీ దూరమయిపోతున్న తరుణంలో తమిళ తంబిలను దగ్గరకు తీసుకోవడం మోడీ తంత్రానికి నిదర్శనం. వాస్తవానికి తమిళనాడులో బీజేపీ దాదాపు జీరో అనే చెప్పాలి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాకపోవడం ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పకనే తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో బలమైన మిత్రుడు నారా చంద్రబాబునాయుడు పార్టీకి కటీఫ్ చెప్పి వెళ్లిపోయారు. తాజాగా తమిళనాడుకు ఎయిమ్స్ మంజూరుచేశారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఎయిమ్స్ కు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో తమిళుల్లో కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్పేమీ లేదన్న అభిప్రాయానికి తమిళులు వచ్చారన్న టాక్ ఉంది. ఇది పళనిస్వామి సర్కార్ కూ ప్రయోజనమే. పళని ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతున్నారు. తూత్తుకూడి వంటి సంఘటనలు కాస్త కలవరపాటుకు గురిచేసినా వెంటనే దానిని సర్దుబాటు చేయగలిగారు. అమ్మ బొమ్మ పెట్టుకుని వెళ్లేందుకే పళనిస్వామి సిద్ధమవుతున్నారు. అమ్మ ఆశయాలు నెరవేరాలంటే తన వల్లనే సాధ్యమవుతుందని ఇటు క్యాడర్ లోనూ, అటు ప్రజల్లోనూ నమ్మకాన్ని తెచ్చుకోగలిగారు. అది గమనించిన కమలం పార్టీ పళని వెనక నిలబడాలనే నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఆగమేఘాల మీద ఎయిమ్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక తమిళనాడు కు కావేరి జలాలు సెంటిమెంట్. అందుకే కావేరీ జలాల వివాదానికి పరిష్కారం త్వరలోనే చూపించే అవకాశముందంటున్నారు. అయితే ఇన్ని చేసినా అక్కడ అధికార పార్టీని ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో ఆదరిస్తారా? లేదా? అన్నది మాత్రం అనుమానమే.మహారాష్ట్ర లో శివసేన అమితుమీ అంటోంది. కర్ణాటకలో అధికారం ఊరించి వెళ్లిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ను తట్టుకోవడం కష్టం. కేరళలో కాలుమోపడానికి వీలులేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు తమకు సేఫ్ జోన్ అని కమలం పార్టీ భావిస్తున్నట్లుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడు మీద కన్ను వేశారు కమలనాధులు. అక్కడి అధికార అన్నాడీఎంకేకు పూర్తి స్థాయిలో సహకరించి వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకున్నా ఎక్కువ స్థానాలున్న తమిళనాడు ఆదుకుంటుందన్న భావనలో ఉన్నారు. అందుకే పళనిని, పన్నీర్ సెల్వాన్ని ఒకటి చేశారు. ప్రభుత్వం పూర్తికాలం కొనసాగేలా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.తమిళనాడులో జయలలిత మృతి చెందాక ఆ పార్టీ కకావికలమై పోయింది. పార్టీ చీఫ్ గా అప్పటి వరకూ వ్యవహరించిన శశికళ జైలు పాలయ్యారు. దినకరన్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అందుకే పళనిస్వామి బలవంతుడయ్యేలా ఆయనకు బూస్ట్ ఇస్తోంది బీజేపీ. లోక్ సభ, రాజ్యసభల్లోనూ అన్నాడీఎంకే ఎక్కువ స్థానాలున్న పార్టీ. పళనిస్వామికి పరిపాలనలో పరోక్షంగా చేయి అందిస్తే అది తమకు ఉపయోగపడుతుందన్నది బీజేపీ భావన.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది కాసేపు పక్కన పెడితే అధికార పార్టీగా ఉండటంతో ఎక్కువ స్థానాలు సాధించవచ్చన్నది మోడీ బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఇటీవల ఢిల్లీ వచ్చిన పళనిస్వామితో మోడీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారని చెబుతున్నారు.