
తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రం. కాని సమైక్య పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో కరంటు ఇవ్వక, సమయానుకూలంగా సాగునీరు అందివ్వక, వర్షాధారం క్రింద పంటలు ఎండిపోయి తెలంగాణ వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, కేవలం నాలుగు సంవత్సరాలలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని అయన అన్నారు. శనివారం నాడు న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అన్నారు. గత పాలకులు తెలంగాణ అవసరాలను గుర్తించలేదు. కాని స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతుల అవసరాలు ఏమిటో గుర్తించి చక చకా నిర్ణయాలను తీసుకుంటున్నారు. మొదటగా 23 లక్షల కరంటు మోటార్లకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నారని అన్నారు. రెండవది సాగునీరు, రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి లక్షా యాబైవేల కోట్లతో గోదావరి, కృష్ణ నదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు రంగారెడ్డి, డిండి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడానికి 20,30 ఏళ్ళు పట్టేది. కాని హరీష్ రావు గారి పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. 2919 నాటికి అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని అన్నారు. మరో గొప్ప పథకం పంట పెట్టుబడికై ఎకరాకు రూ. 8,000 అందించే రైతుబంధు పథకం. 58 లక్షల మంది రైతులకు కోటి యాబై లక్షల ఎకరాలకు రూ. 12,000 కోట్లు అందిస్తున్నామని అన్నారు. రైతుబంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సర్వే రిపోర్టుల ప్రకారం రైతులకు ముందస్తుగానే పెట్టుబడి డబ్బులు సమకూరడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఈ వానాకాలం పంటలను విత్తుకోవడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి అన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల భీమా అందిస్తున్నాం. రైతుకు రూ. 2271 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 98.24 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. 25 ఎకరాలకు పైగా ఉన్న రైతులు కేవలం 0.11 శాతం మాత్రమే. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అత్యధికంగా లబ్ధిపొందుతున్నది సన్న, చిన్నకారు రైతులే అయన అన్నారు. . రైతులకు సహాయపడటానికి, అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేయడానికి రైతు సమన్వయ సమితుల నిర్మాణం. విత్తనం వేసిన దగ్గర నుండి పండిన పంటను అమ్ముకునే వరకు రైతు సమన్వయ సమితీ సభ్యులు రైతులకు సహాయపడతారని అయన వివరించారు.