YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చేయితడిపితే కొలువే..

చేయితడిపితే కొలువే..
విద్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. బోధన మసకబారుతోంది. సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకొంటున్నాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సినవారిని దొడ్డిదారుల్లో స్వాగతం పలుకుతున్నారు. చేయి తడిపినవారే కొలువుదీరుతున్నారు.
మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకు ప్రభుత్వం గతేడాది మైనార్టీ గురుకులాలను ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో నాలుగు బాలుర, రెండు బాలికల గురుకులాలు ఉన్నాయి. ఈసారి నూతనంగా బాలుర కళాశాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బందిని పొరుగు సేవల కింద నియమిస్తున్నారు. కానీ ఇవి జిల్లా యంత్రాంగం అనుమతులు లేకుండా, రిజర్వేషన్‌ నిబంధనలను పాటించకుండా జరుగుతున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కళాశాలకు జిల్లా అధికారులతో సంప్రదింపులు లేకుండా, ఎటువంటి నోటిఫికేషన్‌ లేకుండానే ప్రధానాచార్యులు(ప్రిన్సిపల్‌)ను పొరుగుసేవల సంస్థ నియామకం చేపట్టింది. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది నియామకాలు కూడా ఇదే తరహాలో జరుగుతున్నాయని తెలుస్తోంది.
గతేడాది జిల్లాలో గురుకులాల ప్రారంభ సమయంలో సిబ్బందిని నియమించడానికి ప్రత్యేకంగా  ఏజెన్సీని ఎంపిక చేసేందుకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  నాలుగు దరఖాస్తు వచ్చాయి. అందులో నుంచి ఓ సంస్థను ఎంపిక చేశారు. దీని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించారు. ఆరునెలల అనంతరం సరైన సేవలు అందించడం లేదని సంస్థను తొలగించారు.  ఆ తర్వాత ఎటువంటి నోటిఫికేషన్‌ లేకుండానే కొత్తగా మరో ఏజెన్సీని ఎంపిక చేశారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.  గతంలో నియామకాలు చేసినప్పుడు కూడా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడంతో ఆ ఏజెన్సీని తప్పించారని సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు సహకరించిన అధికారులు సైతం గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేయించుకొని ఇతర జిల్లాలకు వెళ్లారనే విమర్శలున్నాయి. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Posts