YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముందస్తుకు తెలంగాణ రెడీ

ముందస్తుకు తెలంగాణ రెడీ
సై అంటే సై అంటూ  ప్రతిపక్షాలకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావ్ సవాల్ విసిరి ముందస్తు ఎన్నికలపై సంచలనానికి తెర లేపారు. ఇటీవల కాలంలో ముందస్తు ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. ప్రతిపక్షాలకు ముందస్తు ఎన్నికలపై దమ్ముం దా...ఉంటే చెప్పండి అంటూ కేసీఆర్ ముందుకొచ్చారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతుండటం, రైతుబంధు పథకం, రైతు బీమా, భూ ప్రక్షాళన, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు, మిషన్ కాకతీయతో చెరువులను నిండుకుండలా మార్చేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు అండగా టీఆర్‌ఎస్ ఉందనే ధీమాను కల్పించామని కేసీఆర్ పలుమార్లు పేర్కొన్న దాఖలాలున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో గత కొంత కాలంగా నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో తమకు అత్యధిక స్థానాల్లో మెజార్టీ వస్తుందని సర్వేలు చెప్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందస్తుగా తాము సిద్దమనే ధీమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తమకు వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ పేర్కొంటున్నారు. 
పంచాయతీ ఎన్నికలపై ఓ వైపు ఎన్నికల సంఘం ముమ్మరంగా చర్యలు చేపడ్తున్న క్రమంలో ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలు రావచ్చనే సూచనను సీఎం చెప్పకనే చెప్పారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జూలై నెలలో విడుదలయ్యే సూచనలున్నాయని, ఆ దిశగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌లతో పాటు అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాయి. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు సెమీఫైనల్‌గా భావించి తమ రాజకీయ ఎత్తుగడలకు ఇప్పుడిప్పుడే పదును పెడ్తున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనూ. అంతకు ముందు జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల విషయాన్ని విపక్షాల ముందుకు తీసుకువచ్చింది. ఇదే క్రమంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై నోరు విప్పారు. ఇటీవల నిర్వహించిన సర్వేలలో తమ పార్టీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉందనే విషయం వెల్లడైందని స్పష్టం చేశారు. కాగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో  మరింతగా రాజకీయం వేడెక్కనుంది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ మెజార్టీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూచించినట్టుగా ఇటీవల కాలంగా ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలు జరుగవచ్చనే విషయాన్ని అక్కడక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్న మాటలకు కేసీఆర్ చేసిన ప్రకటన మరింత బలాన్ని ఇచ్చింది. ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ సీనీయర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమని మరో సీనీయర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఒప్పిస్తామని, ఇందుకు సంబంధిందించి రాహూల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.  చాపకింద నీరులా సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ఏర్పాటు బీఎల్‌ఎఫ్ తమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. గ్రామీణ స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదంరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజేఎస్‌తో పాటు కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు దిశగా ప్రణాళికలను సీపీఐ ముమ్మరం చేసింది. టీడీపీ రాష్ట్రంలో ఏదేని పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు న్నాయని ఆ పార్టీ అధినేత పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన దాఖలాలున్నాయి. ఇక బీజేపీ దక్షిణ భారతంలో పాగా వేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో రాష్ట్రంలో పర్యటిం చనున్నట్టు ఆ పార్టీ నేతలు ఇటీవలే ప్రకటించారు.

Related Posts