YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ముంబైని ముంచేసిన వానలు ఐదుకు చేరిన మృతులు

ముంబైని ముంచేసిన వానలు ఐదుకు చేరిన మృతులు
ముంబైను భారీ వర్షం వణికిస్తోంది. ఆదివారం రాత్రి మొదలైన కుండపోత.. ఇవాళ కూడా కొనసాగుతోంది. నగరంపై పగబట్టిందా అన్న రేంజ్‌లో జల్లులు తడిపి ముద్ద చేశాయి. ఈ వాన దెబ్బకు రోడ్లపై ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయాయి. పైన వర్షం.. కింద మోకాలికిపైగా నీళ్లతో జనాలు నరకం అనుభవిస్తున్నారు. ఉదయం స్కూల్, కాలేజీలు, ఆఫీస్‌లకు వెళ్లేవాళ్లు రోడ్లపై అష్టకష్టాలు పడ్డారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో చుక్కలు కనిపించాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దాదర్ టీటీ, కింగ్ సర్కిల్., నాగ్‌పడ, శాంటాక్రూజ్, మరోల్ మరోషి మలబార్ మిల్స్, హింద్‌మట, ధార్వీ, బైకుల్లా. అంధేరి ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.థానే సమీపంలో ఓ గోడకూలి 13 ఏళ్ల బాలుడు చనిపోగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండు మూడు చోట్లా గోడలు కూలిపోగా.. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. అక్కడక్కడా వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ భారీ వర్షాల కారణంగా ఐదుగురు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నగరంలో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగింది. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రోడ్లపై నిలిచిపోయిన నీళ్లను మోటార్ల సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పట్టాలపైకి నీళ్లు చేరడంతో లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడస్తున్నాయి. బిలాద్-సంజన్ రైల్వే లైన్ మధ్య వర్షపు నీరు నిలిచిపోవడంతో సింగిల్ లైన్ మాత్రమే నడుస్తోంది. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. విమానాల రాకపోకలపై కూడా వర్ష ప్రభావం పడింది. కొన్ని సర్వీసులు రద్దుకాగా.. మరికొనని ఆలస్యంగా నడుస్తున్నాయి. కేవలం ముంబై మాత్రమే కాదు మహారాష్ట్రలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందట. ఈ వర్ష ప్రభావం అంధేరి, ఖర్‌, మలద్‌ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది.  ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు నగరంలోలో రికార్డు స్థాయిలో 110.80మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో రెండు రోజుల పాటూ అతి భారీ వర్షాలు పడే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related Posts