
అన్ని రంగాలకు చెందిన వారూ ఆర్ధికంగా పరిపుష్టి సాధించేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల అభ్యున్నతికి చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తోంది. ఇక మిషన్ కాకతీయ స్కీమ్ లో భాగంగా పునరుద్ధరించిన, తవ్వించిన చెరువుల్లో చేపలు పెంచుతూ.. మత్స్యకారులు లబ్ధిపొందేలా చూస్తోంది. చేపల అమ్మకానికి ఊతంగా ఉంటుందన్న భావనతో మత్స్యకారులకు రాయితీపై వాహనాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాలంటూ సూచించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం ప్రకటించిన ఈ వెసులుబాటును క్యాష్ చేసుకునేందుకు కొందరు దళారుల అవతారం ఎత్తారన్న విమర్శలు కరీంనగర్ ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నాయి. మేం వాహనాలను ఇప్పిస్తామంటూ దళారులు మత్స్యకారులకు వల వేసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించేశారని అధికారులపై ఒత్తిడి చేస్తామని, వాహనాలను ఇప్పిస్తామంటూ లబ్ధిదారుల వెంటపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 75శాతం రాయితీపై ప్రభుత్వం అందించే వాహనాలకు అర్హుల ఎంపిక జులై నెలాఖరులో జరుగుతుంది. ఇప్పుడే దళారుల ఆగడాలకు తెరదించకపోతే మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉందని అంతా అంటున్నారు.
జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి జిల్లా మత్స్యశాఖ దరఖాస్తులు స్వీకరించింది. 31 రకాల సౌకర్యాలకు 6,560 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ద్విచక్రవాహనాలు, ట్రాలీ ఆటోలకు సంబంధించిన అప్లికేషన్లు ఎక్కువగా ఉన్నాయి. నెలాఖరులోగా ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయడమే కాక వచ్చే నెలలోనే ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేస్తారు. మత్స్యకారులకు అందించే పరికరాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలోనే ఖర్చుచేస్తోంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను కలుపుకొని జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు నిధులు ఇచ్చింది. ఈ నిధులతో 31 రకాల సౌకర్యాలు కల్పిస్తారు. చేపలు పట్టడం మొదలుకొని విక్రయించుకునే వరకు అవసరమైన వస్తువులు, వాహనాలను 100 శాతం, 75 శాతం రాయితీపై ఇస్తారు. గతేడాదే వీటికి సంబంధించిన నిధులు కేటాయించారు. అయితే ఈ కార్యక్రమం అమలు ఆలస్యమైంది. ఈ ఏడాది మాత్రం పక్కాగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఇదిలాఉంటే ఈ పథకం గురించి మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు సైతం నిర్వహించారు. మొత్తంగా 31 రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వీటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి పరిశీలన ప్రారంభమైంది. ఈ దశలో దళారుల హల్ చల్ మొదలైంది. సంబంధిత అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని.. మత్స్యకారులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.