YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

హైదరాబాద్‌లో దారుణ హత్య..

హైదరాబాద్‌లో దారుణ హత్య..

 - ఐదేళ్ల చిన్నారితో  సహా ముగ్గురిని కిరాతకంగా హతమార్చారు

హైదరాబాద్లో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్‌లో జరిగింది. ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తున్న అపర్ణ, ఆమె ఐదేళ్ల కూతురు కార్తికేయ, ఆమె తల్లి విజయలక్ష్మిలను హత్య చేశారు. అపర్ణను వంట గదిలో గోడకు బాది హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. జనవరి 27న (శనివారం) ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా వారు బయటకు రాకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి లోపలికి వెళ్లి చూడగా ఈ హత్యలు వెలుగు చూశాయి. అపర్ణ భర్త మధు పోలీసులకు లొంగిపోయాడు. వంటగదిలో అపర్ణ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఇక, ఆమె కూతురు కార్తికేయ, తల్లి విజయలక్ష్మి మృతదేహాలు బెడ్‌పై పడి ఉన్నాయి. ఘటనాస్థలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

కాగా, 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ హత్యలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు అపర్ణ తాను పనిచేసే షాప్ నుంచి ఇంటికి వచ్చిందని, ఆ తర్వాత గంట సేపటికే ఇంటి నుంచి కేకలు వినిపించాయని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. హత్య గురించి తెలిసిన అనంతరం సోమవారం ఉదయం నుంచి మూడు బృందాలు అతడి ఆచూకీ కోసం ప్రయత్నించినా దొరకలేదు. పోలీసులు తన మొదటి భార్యతో కలిసి మధు నివాసముంటున్న కూకట్‌పల్లిలోని ఇంటికి వెళ్లినా దానికి తాళం వేసి ఉంది. అయితే, సోమవారం మధ్యాహ్నం అతడు పోలీసులకు లొంగిపోయాడు. కానీ, హత్యకు గురైన వారికి తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలు ఎవరు చేసి ఉంటారన్నదానిపై ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, కూకట్‌పల్లిలో మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మధును అపర్ణ పెళ్లి చేసుకుంది. మధుకు అపర్ణ రెండో భార్య. మధు మొదటి భార్య బంధువులే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపర్ణది పశ్చిమగోదావరి జిల్లా భీమవరంగా గుర్తించారు.

 - వేరొకరితో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక..భర్త మధు

హైదరాబాద్ చందానగర్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు చిక్కుముడి వీడింది. అపర్ణను, ఆమె కూతురు కార్తికేయి, ఆమె తల్లి విజయలక్ష్మిని చంపింది తానేనని పోలీసులకు లొంగిపోయిన ఆమె భర్త మధు అంగీకరించాడు. తొలుత వారికి పరిచయస్తుడిగానే పోలీసులకు అతడు లొంగిపోయినా.. పోలీసులు తమ స్టైల్లో విచారించగా నిజం కక్కాడు. అపర్ణ తనకు పదేళ్లుగా తెలుసని, ఆమెతో పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నానని మధు వెల్లడించాడు. అయితే, వేరొకరితో ఆమె చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక.. ఆమెను గోడకేసి బాది చంపేశానని అతడు చెప్పాడు. ఆమె తల్లి విజయలక్ష్మి, కూతురు కార్తికేయిని గొంతు పిసికి చంపానని పోలీసులకు చెప్పాడు మధు. కాగా, సోమవారం మధ్యాహ్నమే నిందితుడు మధు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.

Related Posts