YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడారంలో జనజాతర సంబురం..

మేడారంలో జనజాతర సంబురం..

 - వన దేవతలు.. అశేష భక్తులు..

- అంతులేని విశ్వాసాలు.. శివసత్తుల పూనకాలు..

- పొర్లు దండాలు.. ఎడ్లబండ్ల పరుగులు..

- కొత్త బెల్లం సువాసనలు..

మేడారం సమ్మక్క- సారలమ్మసంబురం మొదలైంది. బుధవారం  బుధవారం జనజాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అమ్మలను వేలాది మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా.. మూడు రోజులపాటు జరిగే జాతరకు ఈసారి కోటి మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. మరోవైపు పగిడిద్దరాజు పెళ్లికొడుకై కదిలాడు. సమ్మక్క గద్దెకు సపరివారసమేతంగా పయనమయ్యాడు. బుధవారం సమక్క గద్దెను చేరుకోనుంది. 

ఈ నాలుగు రోజుల్లో ఈ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తుంది. సాధారణ రోజుల్లో అడపాదడపా జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో జాతర రోజుల్లో మాత్రం మహాజన సంద్రంగా మారుతోంది. భక్తుల కీర్తనలు, శివసత్తుల పునకాల తో అటవీ ప్రాంతమంతా మారుమోగనుంది. జాతరకు వచ్చిన భక్తుల వంటకాల ఘుమఘుమలు నోరూ రిస్తాయి. జాతర ఏర్పాట్లలో భాగంగా రెండోసారి వన్‌వే ను అమలు చేస్తున్నారు. జంపన్నవాగులో నీరు కన్పిం చనంత మేర భక్తులు స్నానాలు ఆచరిస్తారు. శివసత్తులు తడిబట్టలతో, గిరిజనులు, ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ అమ్మల దర్శనానికి వచ్చే దృశ్యాలు కనులవిందుగా కన్పిస్తాయి. తమ కోర్కెలు తీర్చాలంటూ భక్తులు తలనీలాలు సమర్పించడం, నిలువు దోపిడీ ఇవ్వడం వంటి మొక్కులను చెల్లిస్తారు. 

  అమ్మలకు ఎంతో ఇష్టమైన బంగారాన్ని తులాభారం వేసి సమర్పిస్తారు. సమ్మక్క, సారక్కలు గద్దె వద్దకు చేరుకునే సమయంలో భక్తులు వారి ముందు సాష్టాంగ నమస్కారాలతో దారిలో సాగిలపడతారు. వడ్డెలు తమపై నుంచి నడుచుకుంటూ వెళుతుంటే.. సాక్షాత్తూ అమ్మలే వారి మీదుగా నడిచివెళుతున్నట్టు భావించి తన్మయత్వంలో మునిగిపోతారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో మేడారం చుట్టూ 50 కిలోమీటర్ల మేర భక్త జనం కిక్కిరిసిపోతోంది.

అన్ని ఏర్పాట్లు పూర్తి..
ప్రభుత్వం జాతరకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరుగుదొడ్లు, నీటి సౌకర్యంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. జాతరలో కీలకంగా వ్యవహరించే పోలీసుశాఖ నుంచి 15 వేల మంది సిబ్బంది, ఆర్టీసీ నుంచి 12 వేల మంది సిబ్బంది ఇప్పటికే వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరారు. ముఖ్యంగా సమ్మక్క చిలకలగుట్ట నుంచి వచ్చే సమయంలో అధికారులు చాలా సమన్వయం పాటించేలా అధికారులు సిబ్బందికి సూచించారు. జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా మేడారంలోనే మకాం వేసింది.

Related Posts