YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలు రద్దు..?

బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలు  రద్దు..?

-  యూపీ సర్కార్ నిర్ణయం

స్వాతంత్ర్యం వచ్చే దాకా మన దగ్గర ఉన్నది బ్రిటిషు వాళ్లు రూపొందించిన చట్టాలే. ఇప్పటికీ వాటిలోని చాలా చట్టాలు వాడుకలోనే ఉన్నాయి. అప్పటికీ..ఇప్పటికీ కాలం పూర్తిగా మారిపోవడం, దానికి తగినట్టు పరిణామాలు సంభవించడం, కొత్త చట్టాలు వస్తుండడంతో ఆ పాత కాలం నాటి బ్రిటిష్ చట్టాలకు చరమగీతం పాడాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. బ్రిటిష్ కాలం నాటి వెయ్యి చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. అందులో కొన్ని 150 ఏళ్లకు పైబడిన పాత చట్టాలూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికే యోగి ప్రభుత్వం వాటికి సంబంధించిన జాబితానుకూడా తయారు చేసింది. వచ్చే బడ్జెట్‌లోనే దానికి సంబంధించిన బిల్లును సభలో పెట్టాలని చూస్తోంది. కొత్త న్యాయ నిబంధనలు వస్తున్న తరుణంలో ఇలాంటి పాత చట్టాల అవసరం ఇక లేదని, ఒకేసారి అలాంటి చట్టాలన్నింటినీ రద్దు చేయడం కోసం వాటిని పరీక్షిస్తున్నామని ఉత్తర్‌ప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి బ్రిజేశ్ పట్నాయక్ చెప్పారు.

కాగా, యూపీ రద్దు చేయబోతున్న చట్టాల్లో ఒకటి 1890 అక్టోబరు 16న వాయువ్య భారతం, ఔధ్ ప్రావిన్సుల్లో మెరుగైన పాలన కోసం రూపొందించిన ద యునైటెడ్ ప్రావిన్స్ యాక్ట్ 1890 కూడా ఉంది. కాగా, అంతకుముందు గత ఏడాది డిసెంబరులో 245 మురిగిపోయిన పాత చట్టాలను రద్దు చేస్తూ లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 1800 పాత చట్టాలను రద్దు చేసినట్టు చెప్పారు. జస్టిస్ ఏపీ షా నేత్రుత్వంలోని 20వ లా కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా 2014 సెప్టెంబరు నుంచి పాత చట్టాల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా యూపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాగా, అంతకుముందు 1950లో 1029 పాత చట్టాలను నాటి పార్లమెంట్ రద్దు చేసింది. 

Related Posts