YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జాగ్రత్తలతోనే ఆరోగ్యం పదిలం

 జాగ్రత్తలతోనే ఆరోగ్యం పదిలం
వానాకాలం వ్యాధుల సీజన్. దోమలు, క్రిమి కీటకాదులు విస్తరించే సీజన్ కావడంతో.. వ్యాధుల విజృంభణా అదే రేంజ్ లో ఉంటుంది. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యాలపాలవడం ఖాయం. ఇంటి వాతావరణమే కాక.. బయట పరిసరాలూ పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండగలమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. దోమ కాటుకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దోమల వల్ల ప్రధానంగా మలేరియా, విషజ్వరాలే కాక ఫైలేరియా,  డెంగీ, టైఫాయిడ్‌, గన్యా లాంటి వ్యాధులూ సోకుతాయి. ఎన్నో అంటువ్యాధులను వ్యాపింపజేస్తుంటాయి. వ్యాధిగ్రస్తుడైన వ్యక్తిని కుట్టిన దోమ మరో వ్యక్తికి కుడితే అతడికి కూడా అనారోగ్యం సోకుతుంది. అందుకే దోమల నివారణపైనే కాక.. దోమ కాటుకు గురవకుండా అంతా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో అటవీ ప్రాంతంతో పాటూ గిరిజన గ్రామాలు అధికంగానే ఉన్నాయి. ఇక్కడి అడవుల సమీపంలో ఉండే గ్రామాలు, అపరిశుభ్ర వాతావరణం ఉన్న చోట దోమల వృద్ధి అధికంగా ఉంది. ఇప్పటివరకు మలేరియా, విష జ్వరాలతో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఎంతో మంది తీవ్ర అనారోగ్యాల పాలయ్యారు. కొందరు ప్రాణాలుకోల్పోయిన ఉదంతాలు సైతం ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ సమస్యను నివారించేందుకు ఏటా ఏజన్సీ ప్రాంత వాసులకు దోమ తెరలు అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తోంది.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి  గిరిజనులకు సర్కార్ నాణ్యమైన దోమ తెరలను ఏటా అందిస్తోంది. అయితే కొందరు అవగాహన లేక మూలన పడేస్తున్నారు. దోమతెరలు వాడితేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే.. అనారోగ్యాల పాలవడం ఖాయం. అధికారుల సూచనలు పాటిస్తూ ఉపయోగించుకున్నట్లయితే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. నిర్మల్ లోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దోమ తెరలు పంపిణీ చేశారు. మలేరియా వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో సరఫరా చేయటానికి మరికొన్ని నిల్వ ఉంచారు.  ప్రభుత్వం సరఫరా చేసిన ఈ దోమ తెరలపై దోమలు దగ్గరకు రాకుండా ఉండేలా రసాయన పూత(డేల్లా మైథ్రిన్‌) ఉంటుంది. ఈ తెరలను ప్రతి ఏడాది వాడుకున్న అనంతరం చల్లటి నీటిలో ముంచి తీసి నీడలోనే ఆరబెట్టుకొని భద్రపరచుకుంటే మరో ఏడాది వినియోగించుకోవటానికి వీలుంటుందని అధికారులు చెప్తున్నారు. వీటిపై ఉండే రసాయన ప్రభావం నాలుగేళ్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ దోమ తెరలు వాడడం వల్ల దోమల నుంచి రక్షణ ఉండడంతో పాటూ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇదిలాఉంటే అపరిశుభ్ర వాతావరణం ఉన్న గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాల్సి ఉంది. పలు ప్రాంతాల్లో మురుగునీరు రహదారులపైకే చేరుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. 

Related Posts