YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జనరిక్.. ఎక్కడ..?

 జనరిక్.. ఎక్కడ..?
సామాన్యులకు తక్కువ ధరలకే మందులను అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ప్రజలు వైద్యానికి సంబంధించి చేసే ఖర్చుల్లో 70 శాతానికి పైగా మందులదే ఉంటుంది. వారికి ఉపశమనం కలిగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జనరిక్‌ మందుల దుకాణాలను ఏర్పాటు చేసింది. నిర్వహణ లోపం.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవి లక్ష్యాన్ని చేరలేక పోతున్నాయి. జన ఔషధి పేరుతో 2013లో జనరిక్‌ మందుల దుకాణాల్ని ఏర్పాటు చేశారు. తొలుత పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల వద్ద వీటిని ప్రారంభించి జిల్లా మహిళా సమాఖ్యలకు నిర్వహణ బాధ్యతలు 
అప్పగించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మరింత పెంచే దిశగా 2015లో అన్న సంజీవని పేరుతో మండలానికో దుకాణం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తరువాత రామచంద్రపురం, అమలాపురం, తుని, మండపేట, ఏలేశ్వరం ఆసుపత్రుల వద్ద మెప్మా ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ ఆసుపత్రుల పరిధిలో కాకినాడ, రాజమహేంద్రవరం, కొత్తపేట, మమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, అంబాజీపేట, అనపర్తి, కోరుకొండల్లో మండల సమైఖ్య సంఘాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో రోగులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సైతం బ్రాండెడ్‌ మందులనే రాసి ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌, జనరిక్‌ మందుల పనితీరులో తేడా లేదని పరిశోధనల్లో తేలింది. జనరిక్‌తో పోలిస్తే బ్రాండెడ్‌ ధర నాలుగు రెట్లకు పైగా అధికంగా ఉంటుంది. జనరిక్‌ మందుల దుకాణాల్లో మందుల రకాన్ని బట్టి 50 నుంచి 80 శాతం రాయితీతో వివిధ రకాలను అందుబాటులో ఉంచి విక్రయాలు చేయాలి.
జిల్లా కేంద్రం కాకినాడ, రాజమహేంద్రవరం మినహా మిగిలిన ప్రాంతాల్లోని జనరిక్‌ మందుల దుకాణాల్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. మధుమేహం, రక్తపోటు, కొవ్వు, గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన మందులు అరకొరగా దొరుకుతున్నాయి. ఈ దుకాణాల్లో దాదాపు 1600 రకాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా,  జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మినహా చాలాచోట్ల 200 మించి ఉండడం లేదు. అవి కూడా అరకొరగానే తెస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిఫార్సు చేసినవి కూడా లేవనడంతో ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. పలుచోట్ల ఎక్కువ ధర వసూలు చేసున్నట్లు ఆరోపణలున్నాయి. జనరిక్‌ మందుల దుకాణాల్లో అమ్మే ఔషధంపై ఉన్న ధరలో 30 శాతం తగ్గించి విక్రయించాలి. కొన్నిచోట్ల అలా చేయకుండా  విక్రయాలు చేస్తున్న పరిస్థితులున్నాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఒక్కో ప్రైవేటు మందుల దుకాణంలో నిత్యం రూ. లక్షల్లో మందుల వ్యాపారం చేస్తుంటే.. జనరిక్‌ దుకాణాల్లో మాత్రం రూ. వేలల్లో కూడా ఉండడం లేదు.
ప్రజలకు జనరిక్‌ మందులపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. వైద్యులు జనరిక్‌ మందుల పేర్లతోనే అర్థమయ్యేలా మందులు రాయాలని భారతీయ వైద్య మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. పైగా జనరిక్‌ సరిగా పనిచేయవనే దుష్ప్రచారం చేయడంతో ప్రజలు ఆర్థిక భారమైనా బ్రాండెడ్‌ మందులను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై గ్రామస్థాయిలో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
 
అన్న సంజీవని మందుల దుకాణాల నిర్వహణ భారంగా మారడంతో డ్వాక్రా సంఘాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో డీ ఫార్మసీ ధ్రువీకరణ పత్రాలు కలిగిన ప్రైవేటు వ్యక్తులకు కొన్నింటిని అప్పగించారు. జనరిక్‌ మందులను ఆర్డరు చేసి ఒకసారి తీసుకువస్తే అవి విక్రయాలు జరిగినా.. జరగకపోయినా సదరు దుకాణదారుడే భరించాలి. అదే ప్రైవేటు దుకాణాల్లో అయితే వినియోగం తేదీ ముగిసిన వాటిని సదరు కంపెనీలు వెనక్కి తీసుకుంటాయి. జనరిక్‌ విధానంలో ఈ వెసులుబాటు లేకపోవడం వల్ల మిగిలిపోయిన వాటితో నష్టపోతున్నామని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. అన్న సంజీవిని మందుల దుకాణాల్లో సీజనల్‌గా ఏ మందులు పెట్టాలన్న విషయాలను దుకాణదారులు, ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అప్పుడే జనరిక్‌ మందులు దుకాణాలు సజావుగా సాగి.. ప్రజలకు వీటిపై అవగాహన పెరుగుతుంది.
మనకు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో జనరిక్‌ మందుల విక్రయాలు జోరుగా పెరిగాయి. వీటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో డ్వాక్రా మహిళల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి జనరిక్‌ మందులను వినియోగించేలా చర్యలు చేపట్టారు. లక్షల మంది రోగులకు వారు వాడే మందులను ప్యాక్‌ చేసి ఇళ్లకే తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారు. బ్రాండెడ్‌ కంటే 80 శాతం తక్కువ ధరకు ఇంటికే రావడంతో రోగులకు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులను తగ్గించుకోగలిగారు. ఈ విధానం జిల్లాలోనూ అమలు చేస్తే జనరిక్‌ మందుల విక్రయాలు పెరుగుతాయి. అవసరమైన మందులను ఏజెన్సీల ద్వారా తీసుకువచ్చి వాటిని నిల్వ ఉంచేందుకు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది.

Related Posts